అమెరికాలోని న్యూయార్క్ మహానగరంలో ప్రపంచప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ కూడలి దగ్గర, శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గాపూజ నిర్వహించారు. భారతీయ సంస్కృతీ వైభవాన్ని చాటే ఈ కార్యక్రమాన్ని బెంగాలీ క్లబ్ యుఎస్ఎ వారు నిర్వహించారు. రెండురోజుల పాటు జరిగిన కార్యక్రమంలో పెద్దసంఖ్యలో ప్రవాసభారతీయులు సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు.
ప్రపంచంలో అత్యంత రద్దీ ప్రదేశాల్లో ఒకటైన టైమ్స్ స్క్వేర్ దగ్గర దుర్గాపూజా మంటపం ఏర్పాటు చేసారు. నవరాత్రి పర్వదిన వేడుకల సందర్భంగా నవమి పూజ నిర్వహించారు, దుర్గా స్తోత్రాలు పారాయణం చేసారు. ప్రవాస భారతీయులు భక్తితో పూజాపాఠాల్లో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబంగా రూపొందిన దుర్గాపూజా మంటపాన్ని పెద్దసంఖ్యలో అమెరికన్లు, ఇతర దేశాల వారు ఆసక్తితో గమనించారు. ఈ వేడుకల సందర్భంగా లైవ్‌బ్యాండ్ ప్రదర్శన కూడా ఏర్పాటు చేసారు.
టైమ్స్ స్క్వేర్ దగ్గర మొదటిసారి దుర్గాపూజ వేడుకల నిర్వహణ చారిత్రకం అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. అమెరికాలో ప్రవాస భారతీయుల ప్రాభవం పెరుగుతోందనడానికి ఈ వేడుకల నిర్వహణే నిదర్శనమని అభిప్రాయపడ్డారు. భారతీయుల ఘన సాంస్కృతిక వైవిధ్యాన్ని ఈ వేడుక కళ్ళకు కట్టింది.
సంప్రదాయ పూజాపాఠాలు, స్తోత్రాల భక్తిపారాయణాల తర్వాత వినోదకరమైన వేడుకలు కూడా నిర్వహించారు. బాలీవుడ్ పాటలు పాడారు, వాటికి నాట్యాలు చేసారు. ఆధ్యాత్మిక శోభకు వినోదవల్లరి జతపడింది. ప్రవాస భారతీయులు, ప్రత్యేకించి బెంగాలీయులు ఈ నవరాత్రి వేడుకలతో టైమ్స్ స్క్వేర్‌లో సందడి చేసారు.