ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భారీ మతమార్పిడి రాకెట్ బైటపడింది. స్థానిక హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రలోభపెడుతూ బలవంతం చేస్తున్న క్రైస్తవ మిషనరీలు దొరికారు. ఈ మతమార్పిడి ప్రయత్నాలను అడ్డుకున్నవారిపై పాస్టర్లు, వారి అనుచరులు హింసకు పాల్పడినట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు 40మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఒక ప్రైవేటు నివాసంలో ప్రార్థనా సమావేశం ఏర్పాటు చేసి అక్కడ మగవారు, ఆడవారు, పిల్లలను సమీకరించి వారిని మతం మార్చే అక్రమ కార్యకలాపాలు చేపట్టారు. అక్కడ పోలీసులకు పెద్దసంఖ్యలో మతగ్రంథాలు, ఇతర వస్తుసామగ్రి లభించాయి. ఒక బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసారు. ఆ సంఘటనకు సంబంధించి అయోధ్య పోలీసులు ముగ్గురు వ్యక్తుల మీద ఆరోపణలు నమోదు చేసారు.
పోలీసుల సమాచారం ప్రకారం నిందితులు ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలను ప్రార్థనా సమావేశాల పేరుతో ఆహ్వానించారు. వారికి పేదరికం నుంచి విముక్తి కల్పిస్తామంటూ ఆకట్టుకున్నారు. బైబిల్ చదవడం, ఏసుకు ప్రార్థనలు చేయడం ద్వారా వారి కష్టాలు తీరిపోతాయని నమ్మబలికారు. ఆ మతమార్పిడి ముఠా కార్యకలాపాల మీద స్థానిక ప్రజలు చాలారోజుల నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ 29న ప్రయాగ్‌రాజ్ హైవే మీద ఖజురాహత్ స్క్వేర్ సమీపంలో అక్రమ మతమార్పిడులు జరుగుతున్న ఒక ఇంటిని చుట్టుముట్టారు. ఆ సోదాల్లో భాగంగా ముగ్గురు వ్యక్తులను కస్టడీలోకి తీసుకున్నారు. ప్రార్థనా సమావేశంలో ఉన్న స్త్రీపురుషులు పిల్లలు అందరినీ అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. రాంశరణ్ తివారీ అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా బికాయ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. తివారీ తన ఫిర్యాదులో మోతీలాల్ పాశ్వాన్, అతని భార్య మీరా, దిలీప్‌కుమార్ అనే ముగ్గురిపై ఆరోపణలు చేసారు.
బికాయ్‌పూర్ నివాసి అయిన రాంశరణ్ తివారీ తన ఫిర్యాదులో ఈవిధంగా చెప్పారు, ‘‘ఖజురాహత్ స్క్వేర్ దగ్గర ఒక టీ దుకాణంలో నేను మరికొందరితో కూర్చుని ఉన్నాను. నా అనారోగ్యం గురించి, ఇతర సమస్యల గురించి వారికి చెబుతున్నాను. అప్పుడు మధ్యాహ్నం 3 గంటలవుతోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మోతీరాం పాశ్వాన్ అనే వ్యక్తి మా సంభాషణ విన్నాడు. ఏసుక్రీస్తు ప్రార్థనా సమావేశంలో పాల్గొంటే నా సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పాడు. అతనితో వెళ్ళడానికి మేం ఒప్పుకోలేదు. అయినా అతను బలవంతం చేసాడు. చివరికి మేమిద్దరం ఆ ప్రార్థనా సమావేశం జరుగుతున్న ఇంటికి వెళ్ళాము. ఆ ఇంటిలోపల మోతీలాల్ భార్య మీరాకుమారి, వారి స్నేహితుడు దిలీప్‌కుమార్ ఉన్నారు.’’
‘‘ప్రార్థనా సమావేశంలో సుమారు పాతిక మంది ఉన్నారు. కార్యక్రమ నిర్వాహకులు హిందూ దేవతల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ, ఆ ప్రార్థనకు వచ్చినవారిని రెచ్చగొడుతున్నారు. వాళ్ళు అందరికీ డబ్బులు, బైబిళ్ళు పంచిపెడుతున్నారు. క్రైస్తవంలోకి మారతామంటూ ఒట్టువేయాలని బలవంతం చేస్తున్నారు. ఆ వ్యక్తులు దళిత కాలనీల దగ్గరకు వెళ్ళి వాళ్ళకు డబ్బు ఆశచూపి ప్రలోభపెట్టి మతం మారుస్తున్నారు’’ అని తివారీ చెప్పాడు.
‘‘ప్రార్థనా సమావేశంలో వాళ్ళు దెయ్యాల గురించి, చేతబడుల గురించీ మాట్లాడారు. వాళ్ళు నాకు డబ్బులు ఆశ చూపించి, మతం మారాలంటూ ఒత్తిడి చేసారు. నేను, నా స్నేహితుడు నిరాకరించడంతో మమ్మల్ని చితకబాదారు. మేం ఎలాగోలా అక్కడినుంచి తప్పించుకున్నాం’’ అని వివరించాడు.
ఆ ప్రార్థనా సమావేశాలకు హాజరయ్యేవారు సాధారణంగా నిరుపేదలై ఉంటారు, వారు పెద్దగా చదువుకున్నవారు కాదు. క్రైస్తవ మిషనరీలు ఇంటింటికీ వెళ్ళి, వారి సమస్యల గురించి అడిగి, వారికి డబ్బు ఇస్తామని ఆశచూపి, మతం మారాలంటూ ప్రలోభపెడుతున్నారని తివారీ చెప్పాడు. ‘‘క్రైస్తవదేశాలు చాలా ధనిక దేశాలు. వాళ్ళు మనకు సహాయం చేస్తున్నారు. వాళ్ళతో పాటు క్రైస్తవంలోకి మారితే మన అన్ని సమస్యలూ తీరుస్తామని వారు హామీ ఇస్తున్నారు అని ఈ మిషనరీలు జనాలకు చెబుతున్నారు’’ అని వివరించాడు.
మిషనరీలు చేసే మరో మోసం గురించి కూడా తివారీ చెప్పాడు. ప్రజలు నేరుగా మతం మారాలని బలవంతం చేయట్లేదని చెబుతారు. కేవలం మీ ప్రార్థన పద్ధతిని మార్చుకుంటే చాలు అని చెబుతారు. ‘‘మేం మా పేర్లు మార్చుకోవలసిన పనిలేదు, కేవలం మేం ప్రార్థన చేసే పద్ధతిని మార్చుకుంటే చాలు అని చెప్పారు’’ అంటూ మిషనరీలు మోసం చేసే పద్ధతిని వెల్లడించాడు.
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బల్వంత్ చౌధరి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘‘ప్రార్థనా సమావేశం దగ్గరనుంచి పెద్దసంఖ్యలో మతపుస్తకాలు స్వాధీనం చేసుకున్నాము. దర్యాప్తు జరుగుతోంది. ముగ్గురు మిషనరీలను అరెస్ట్ చేసాము. కొన్ని అభ్యంతరకర వస్తువులు కూడా దొరికాయి’’ అని వివరించారు.
క్రైస్తవ మిషనరీల మతమార్పిడి ప్రయత్నాలు కొత్తేమీ కాదు. కాకపోతే హిందువులకు పుణ్యక్షేత్రమైన, భగవాన్ శ్రీరామచంద్రుడి జన్మస్థలమైన అయోధ్యలో మతమార్పిడి ప్రయత్నాలు ఆందోళనకరం. అయోధ్య లాంటి హిందువుల తీర్థయాత్రాస్థలంలో మతమార్పిడి ప్రయత్నాలు, చర్చిలు ఏర్పాటు చేయడాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.