రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది. ప్రొటీన్ల డిజైన్లకు సంబంధించిన పరిశోధనలకు గానూ శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్ హసబిస్, జాన్ ఎం.జంపర్‌ను నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పేర్కొంది.
వైద్యవిభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14 వరకు కొనసాగనుంది. వైద్యశాస్త్రంలో విజేతలను సోమవారం ప్రకటించగా, భౌతికశాస్త్రంలో నోబెల్ అవార్డులను మంగళవారం ప్రకటించారు.
ఈరోజు(బుధవారం) రసాయనశాస్త్రంలో నోబెల్‌కు పురస్కారానికి ఎంపికైన వారి జాబితా వెల్లడించారు. సాహిత్యం విభాగానికి సంబంధించి ప్రకటన గురువారం వెలువడనుంది. శుక్రవారం నాడు నోబెల్ శాంతి బహుమతి , అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.