శరన్నవరాత్రుల సందర్భంగా బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గమ్మవారికి సీఎం చంద్రబాబు, రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి కొండపైకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబులకు ఆలయ అధకారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తో కలిసి అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపుకుంకుమ, సారె సమర్పించారు. నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం చంద్రబాబుకు ఆయన కుటుంబ సభ్యులకు పండితులు వేదాశ్వీరచనం అందించారు.
అంతకు ముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దుర్గమ్మను దర్శించుకున్నారు. కుమార్తె ఆద్యతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. పవన్ తో పాటు హోంమంత్రి అనిత, ఎంపీ శివనాథ్ ఇతర ప్రజాప్రతినిధులు దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు.
ఈ రోజు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి శక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసిన తర్వాత అమ్మవారు దుర్గాదేవిగా అవతరించారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున అమ్మవారిని సరస్వతీ రూపంలో అలంకరిస్తారు. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా విద్యార్థులు వాగ్దేవి అనుగ్రహం పొంది సర్వ విద్యలలో విజయం సాధిస్తారు.