హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బీజేపీ తారుమారు చేసేసింది. రాష్ట్రచరిత్రలో మొదటిసారి, వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. 90 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ సాధారణ మెజారిటీ అయిన 46కంటె రెండుస్థానాలు అధికంగా అంటే మొత్తం 48 స్థానాల్లో విజయం సాధించింది. 2019లో వచ్చిన 40 స్థానాల కంటె ఎక్కువ సీట్లు సాధించింది, అలాగే ఓట్‌షేర్ కూడా గణనీయంగా పెంచుకుంది.
ఇంక హర్యానా ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన కాంగ్రెస్, 37స్థానాలు మాత్రం దక్కించుకోగలిగింది. అధికారానికి పది సీట్ల ఆవల నిలిచిపోయింది, అంతేకాదు, రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్న బీజేపీని హ్యాట్రిక్ చేయకుండా నిలువరించలేకపోయింది.
సాధారణంగా ఒక పర్యాయం అధికారంలో ఉన్న పార్టీకి ఎంతోకొంత వ్యతిరేకత ఉంటుంది. అలాంటిది రెండుసార్లు గెలిచి పూర్తిగా దశాబ్దకాలం పాటు హర్యానాను ఏలిన బీజేపీ మూడోసారి కూడా విజయం సాధించిందంటే అది కేవలం అదృష్టం కాదు. హరి నడయాడిన దేశంలో కమల వికాసానికి చాలా కారణాలున్నాయి. సరైన రాజకీయ వ్యూహం, ప్రచారం ముందుగానే ప్రారంభించడం, ఓటుబ్యాంకును పటిష్టం చేసుకునేలా సరైన లెక్కతో తీసుకున్న సమయానికి తగిన నిర్ణయాలు బీజేపీకి విజయాన్ని అందించిపెట్టాయి. పైగా ప్రజావ్యతిరేకత తక్కువ ఉండడం, ప్రతిపక్షంలో అంతర్గత విభేదాలు ఉండడం, ఓటింగ్ సరళి తునాతునకలుగా ఉండడం ఆ పార్టీకి లాభించాయి.
బీజేపీ విజయానికి కీలకమైన కారణాల్లో ప్రధానమైనది.. జాటేతర ఓట్లను కన్సాలిడేట్ చేయడంలో సమర్థంగా పనిచేయడం. 2014 ఎన్నికల్లో గెలుపు తర్వాత బీజేపీ హర్యానాలో అదే వ్యూహాన్ని కొనసాగిస్తూ వస్తోంది. సాధారణంగా హర్యానాలో రాజకీయాధికారం రాష్ట్ర జనాభాలో 25శాతమున్న అగ్రవర్ణ జాట్ల చేతిలో ఉండేది. దాంతో బీజేపీ 75శాతం ఓటర్లున్న జాటేతర జనాభా మీద దృష్టి సారించింది. ప్రత్యేకించి ఓబీసీలు, ఎస్సీలను ఆకట్టుకుంది. 2024 ఎన్నికల్లో ఓబీసీ నాయకుడు నాయబ్‌సింగ్ సైనీని నియమించడం ద్వారా బీజేపీ తన విధానాన్ని మరోసారి స్పష్టం చేసింది. 2024 మార్చిలో మనోహర్‌లాల్ ఖట్టర్ వారసుడిగా ముఖ్యమంత్రి పదవిలో బీజేపీ కూచోబెట్టిన నాయబ్‌సింగ్ సైనీ పంజాబీ ఖత్రీ సామాజికవర్గానికి చెందినవాడు. అలా హర్యానా రాజకీయాల్లో సంప్రదాయిక జాట్ ఆధిపత్యానికి బీజేపీ స్వస్తి పలికింది. సైనీ నియామకం జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయం. రాష్ట్ర ఓటర్లలో దాదాపు 40శాతం ఉన్న ఓబీసీల పట్ల తమ విధేయతను చూపిన నిర్ణయం.
ఈ సారి ఎన్నికల్లో సైనీ అభ్యర్ధిత్వాన్ని చాలా ముందుగానే నిర్ధారించడం వ్యూహాత్మక నిర్ణయం. దాంతో బీజేపీ జాటేతర కులాల్లో తమకు మద్దతును పెంచుకోగలిగింది. చిరకాలంగా అగ్రవర్ణ జాట్ నాయకుల ఆధిక్యంలో ఉన్న రాష్ట్రంలో ఓబీసీ నాయకుణ్ణి పార్టీకి ముఖంగా ప్రకటించడం ద్వారా బీజేపీ అణగారిన బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీగా తనను చాటుకోగలిగింది. దాంతో సాధారణ కులసమీకరణాలను అధిగమించి ఓబీసీలు, ఎస్సీ కులాల మద్దతును బీజేపీ గణనీయంగా రాబట్టుకోగలిగింది.
జాటేతర కులాల ఓటర్లను సమీకరించడానికి బీజేపీ ప్రయత్నంలో భాగంగా ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఓటర్లను ఆకట్టుకోడానికి నిర్దిష్ట ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. ఎస్సీ కులాల వారికి ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించడం, ‘లఖ్పతి డ్రోన్ దీదీ’ వంటి కార్యక్రమాలతో మహిళా సాధికారతను చాటడం వంటి చర్యల ద్వారా బడుగు బలహీన వర్గాల్లో బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకోగలిగింది. ‘లఖ్పతి డ్రోన్ దీదీ’ కార్యక్రమం ద్వారా దళిత, ఎస్సీ కులాల మహిళల స్వయంసహాయక బృందాలు సాధికారత సాధించాయి, ఆ మహిళలు టెక్నాలజీ ఆధారిత వ్యాపారవేత్తలుగా ఎదిగారు. తద్వారా బీజేపీ వాగ్దానం చేసిన సామాజిక ఆర్థిక చలనం సాకారమైంది. ఆ స్వయంసహాయక బృందాలకు చెందిన ఎస్సీ మహిళలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా మాట్లాడడం, వారిని జాతీయకార్యక్రమాలకు ఆయన స్వయంగా ఆహ్వానించడం దళితుల్లో మంచి ముద్ర వేసాయి. తద్వారా ఎస్సీ యువతరంలో బీజేపీ తమను సమీకరిస్తుంది, సాధికారత వైపు నడుపుతుందన్న సానుకూల ముద్ర పడింది. ‘‘మోదీజీ ఎస్సీలను జనరల్ కేటగిరీకి తీసుకువెళ్ళగలరు’’ అని అంబాలాలోని ఒక ఐటీఐలో చదువుతున్న ఎస్సీ విద్యార్ధి వ్యాఖ్యానించడం, బీజేపీ నాయకత్వం మీద ఎస్సీ ఓటర్లలో పెరుగుతున్న ఆశలు, ఆకాంక్షలకు నిదర్శనం.
ఏ పార్టీకైనా పదేళ్ళ పాలన తర్వాత ప్రజావ్యతిరేకత రావడం సహజం. దాన్ని అధిగమించడానికి, తమ ఇమేజ్ను కాపాడుకోడానికి బీజేపీ తన అభ్యర్ధుల ఎంపికలో వినూత్నమైన పద్ధతిని అనుసరించింది. కాంగ్రెస్‌లో వర్గపోరు, అంతర్గత శత్రుత్వాల కారణంగా సీనియర్ నాయకులు, అధిష్ఠానానికి విధేయులైన వారిని అభ్యర్ధులుగా నిలిపారు. దానికి విరుద్ధంగా బీజేపీ 60మంది కొత్తముఖాలకు అవకాశం కల్పించింది.
రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మనోహర్‌లాల్ ఖట్టర్‌ను మార్చడం అనే వ్యూహాత్మక నిర్ణయం కూడా బీజేపీకి లాభించింది. ఖట్టర్ క్షేత్రస్థాయి పరిస్థితులకు దూరంగా ఉన్నారనీ, ఆయనకు క్షేత్రస్థాయిలో ఎటువంటి సంబంధాలూ లేకుండా పోయాయనే ఒక పేరు వచ్చేసింది. అలాంటి ఖట్టర్ స్థానంలో… అందరికీ అందుబాటులో ఉంటూ, అందరితో సంబంధాలు నెరపుతుండే నాయబ్‌సింగ్ సైనీని కూర్చోబెట్టడం బీజేపీకి బాగా సాయపడింది. జన సామాన్యానికి బీజేపీ నేతలు అందుబాటులో ఉండరని, పొగరుగా ఉంటారనీ జరిగిన ప్రచారం తుడిచిపెట్టుకు పోయింది. సైనీ నిరాడంబరమైన నేపథ్యం, ఓబీసీ అస్తిత్వం ఆయనను ఓటర్లకు సంప్రదాయిక అధికార వ్యవస్థల కంటె మెరుగైన ప్రత్యామ్నాయంగా ఆకర్షించింది.
బీజేపీకి పూర్తి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ తాజా నాయకత్వాన్ని చూపడంలో విఫలమైంది. హర్యానాలో కాంగ్రెస్‌కు ముఖచిత్రమైన భూపీందర్ సింగ్ హూడా సీనియర్ జాట్ నాయకుడు. ఆయన తన క్యాంపులోని అభ్యర్ధులకు, తన విధేయులకు పట్టుపట్టి టికెట్లు ఇప్పించుకున్నాడు. అది కాంగ్రెస్‌లోని అంతర్గత వైషమ్యాలను మరింత బలోపేతం చేసింది. అంతేకాదు, జాటేతర ఓటర్లను పార్టీకి దూరం చేసింది. హూడా ఆధిపత్యంతో కులాధారిత రాజకీయాలు మళ్ళీ వస్తాయని వారు భయపడ్డారు, కాంగ్రెస్‌కు దూరం జరిగారు.
గత ఎన్నికల్లో ఓడిపోయిన 17మంది అభ్యర్ధులకు కాంగ్రెస్ మళ్ళీ టికెట్లు ఇచ్చింది. వారిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్‌భాన్ కూడా ఉన్నారు. దాంతో ఆ పార్టీ ఇంకా గతంలోనే ఇరుక్కుపోయి ఉందనీ, కొత్తనీటికి అవకాశం ఇవ్వడం లేదనీ ప్రజలు మరింత బలంగా విశ్వసించారు. మరోవైపు బీజేపీ కొత్తవారు, యువకులు అయిన అభ్యర్ధులను మోహరించడంతో ప్రజావ్యతిరేకత తగ్గింది. ప్రజలు తమకు బీజేపీ కొత్త నాయకత్వం మెరుగైన భవిష్యత్తును ఇవ్వగలదని విశ్వసించారు.
బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని త్వరగా ప్రారంభించడం కూడా ఆ పార్టీకి లాభించింది. 2024 జనవరి నాటికే బీజేపీ తమ ‘మోదీ కీ గ్యారంటీ’ వ్యాన్లను రంగంలోకి దింపేసింది. అవి అన్ని గ్రామీణ, పట్టణ నియోజకవర్గాల్లో ప్రయాణించాయి. బీజేపీ ప్రభుత్వపు వివిధ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాయి. అవి కేవలం పార్టీ సంక్షేమ పథకాల ప్రచారంతో ఆగిపోకుండా గ్రామస్తుల సమస్యలకు పరిష్కారం చూపించడం ఉపయోగపడింది. ‘పరివార్ పహచాన్ పాత్రాస్’ అనే ప్రత్యేకమైన కుటుంబ గుర్తింపు కార్యక్రమం ద్వారా ప్రతీ ఇంటికీ చేరువయ్యారు.
ఈ ముందస్తు క్షేత్రస్థాయి కార్యాచరణ వల్ల బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో తన ఉనికిని బలంగా చాటుకోగలిగింది. గ్రామీణ ఓటర్లతో బీజేపీ నాయకులు వ్యక్తిగత స్థాయిలో సంబంధాలు ఏర్పరచుకోగలిగారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలను విజయవంతంగా అమలు చేయడం ద్వారా లబ్ధిదారుల బ్యాంకుఖాతాల్లోకి సంక్షేమ ఫలాలను నేరుగా బదిలీ చేయడంలో అత్యంత సమర్ధంగా పనిచేసింది బీజేపీ ప్రభుత్వమేనన్న అభిప్రాయం హర్యానా ప్రజల్లో బలపడింది. ప్రత్యేకించి, తమ ప్రభుత్వం పారదర్శకంగా సమర్థంగా పనిచేసిందని చెప్పుకున్న బీజేపీ ప్రచారానికి గ్రామీణ హర్యానా ఓటర్లు సానుకూలంగా స్పందించారు.
ఇంక గ్రాండ్ట్రంక్రోడ్ కారిడార్ వెంబడి తాము సాధించిన అభివృద్ధిని బీజేపీ సరిగ్గా ప్రచారం చేసుకోగలిగింది. జిటిరోడ్ కారిడార్ అంబాలా నుంచి ఢిల్లీ వరకూ 6 జిల్లాల్లో 25 నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. ఆ ప్రాంతం అంతా మౌలిక వసతుల అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగకల్పన, వాటివల్ల సాకారమైన ప్రగతి ఓటర్ల కళ్ళముందు కనిపించాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ మీద బీజేపీ ప్రభుత్వం దృష్టిసారించడం కూడా ప్రజలను ఆకట్టుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వాల్లోని అరాచక పాలనతో బీజేపీ పాలనలోని క్రమశిక్షణతో కూడిన స్థిరమైన శాంతిభద్రతల పరిస్థితికి ప్రజలు మద్దతు పలికారు.
ప్రతిపక్షాలు విడిపోయి ఉండడం కూడా బీజేపీ విజయావకాశాలను మెరుగుపరిచింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తులో ఉన్నాయి. 2024లో ఆ రెండు పార్టీలూ విడివిడిగా పోటీ చేసాయి. ఇంక ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, జననాయక్ జనతా పార్టీ వంటి స్థానిక పార్టీలు సైతం బరిలో నిలిచాయి. అవి బహుజన సమాజ్ పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ వంటి చిన్నచిన్న పక్షాలతో పొత్తులు పెట్టుకున్నాయి. అలా ప్రత్యర్ధులు వేర్వేరుగా పోటీ చేయడంతో చాలా నియోజకవర్గాల్లో బీజేపీ వ్యతిరేక ఓటు వేర్వేరు కూటముల మధ్య చీలిపోయింది. హోరాహోరీ పోరు జరిగిన చోట్ల ఈ ఓట్ల చీలిక వల్ల బీజేపీ తక్కువ మెజారిటీలతో గెలుపు సొంతం చేసుకోగలిగింది కూడా. ఇంక స్వతంత్ర అభ్యర్ధులు కూడా ఎన్నికల ముఖచిత్రాన్ని మరింత సంక్లిష్టం చేసారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ తమ సందేశాన్ని స్పష్టంగానూ సమర్ధంగానూ ప్రజల్లోకి చేరవేయగలిగింది. దానికితోడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా ప్రచారమూ ఓటర్ల మద్దతును కూడగట్టగలిగింది. బీజేపీ హర్యానాలో 150కి పైగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించింది. వాటిలో ఎక్కువ సభల్లో మోదీ, అమిత్ షా పాల్గొన్నారు. దానికి భిన్నంగా కాంగ్రెస్ కేవలం 70 ర్యాలీలకే పరిమితమైంది.
బీజేపీ తమ ప్రచారంలో అభివృద్ధి, సుపరిపాలన, సంక్షేమం గురించే ప్రధానంగా ప్రస్తావించింది. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రచారం రైతుల సమస్యల గురించి చెప్పడం, అంబానీ అదానీ వంటి పారిశ్రామికవేత్తలను విమర్శించడానికే పరిమితమైంది. అయితే ఎప్పుడూ చెప్పే ఆ ఊకదంపుడు ఉపన్యాసాలు హర్యానా ఓటర్లను ఆకట్టుకోలేకపోయాయి. బీజేపీ అభివృద్ధి అజెండా హర్యానా ప్రజలను ఆకట్టుకుంది. కళ్ళముందు కనిపిస్తున్న పురోగతి వారికి బీజేపీపై నమ్మకాన్ని బలపరిచింది. అందుకే హర్యానా రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించగలిగింది.