రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును వరుసగా పదో సారి కూడా 6.5 శాతంగా కొనసాగించాలని నిర్ణయించింది. మూడు రోజుల ‘ద్రవ్య విధాన కమిటీ భేటీ’లో భాగంగా బుధవారం ఉదయం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
రెపోరేటును యథాతథంగా కొనసాగించాలంటూ ఆరుగురిలో ఐదుగురు సభ్యులు అనుకూలంగా ఓటు వేశారని చెప్పారు. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం సమతుల్యత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
సస్టెయినబుల్ డిపాజిట్ ఫెసిలిటీ(ఎస్డీఎఫ్ ) రేటు 6.25 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్ఎఫ్ ) రేటు, సేవింగ్స్ రేటు 6.75 శాతంగా ఉన్నాయని శక్తికాంత్ దాస్ తెలిపారు.
2024-25లో వాస్తవ జీడీపీ వృద్ధిరేటు 7.2 శాతం ఉంటుందని, రెండో త్రైమాసికంలో 7 శాతం, మూడు, నాలుగో త్రైమాసికంలో 7.4శాతంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో 7.3శాతంగా వృద్ధి రేటును ఆర్బీఐ అంచనా వేసింది. మెరుగైన వర్షపాతం నమోదు, సరిపడా నిల్వలతో ఈ ఏడాది చివరికి ఆహార ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉందని అన్నారు. యూపీఐ లైట్ వాలెట్ పరిమితి రూ.2000 నుంచి రూ.5వేలకు పెంపునకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది.