అర్హులకు త్వరలో రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్‌కార్డుల్లో పేరు మార్పు చేర్పులు కూడా చేపట్టనుంది. కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, చేర్పుతో పాటు కుటుంబాల విభజన, అడ్రస్ మార్పు, కార్డులను ప్రభుత్వానికి సరెండర్ చేయడం వంటి అవకాశాలపై ఎన్డీయే ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 12 వేలు మించకుండా ఉండాలని గత ప్రభుత్వం హయాంలో నిబంధనలు విధించింది. ఈ నిర్ణయం కారణంగా అంగన్వాడీ కార్యకర్తలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రేషన్‌కార్డు కోల్పోవాల్సి వచ్చింది. ఆదాయ పరిమితిని పెంచి తమకు కూడా రేషన్ కార్డులు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.
ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటారు. వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేసే విషయంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఖాళీగా ఉన్న ఆరువేల రేషన్ డీలర్ల పోస్టులు భర్తీ చేయడంతోపాటు కొత్తగా 4 వేలకు పైగా దుకాణాలు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది.