శరన్నవరాత్రి పర్వదినాల్లో దాండియా ఆడడం గుజరాతీ హిందువుల వేడుకల్లో ప్రధానఘట్టం. దేశంలోని అన్ని ప్రాంతాల సంబరాలూ వేడుకలూ అందరికీ విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్నాళ్ళుగా హైదరాబాద్‌లో సైతం దాండియా వేడుకలు పెద్దయెత్తున నిర్వహిస్తున్నారు. అయితే హిందూ అమ్మాయిలు ఎక్కువగా పాల్గొనే దాండియా వేడుకల్లోకి ముస్లిం యువకులు హిందూ పేర్లతో చొరబడుతున్నారు.
ఈ పరిణామం ఆందోళనకరమని, లవ్ జిహాద్ వ్యాపింపజేసే కుట్రల్లో భాగమనీ విశ్వహిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. దాండియా కార్యక్రమాల్లోకి కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ కార్యక్రమ నిర్వాహకులకు, పోలీసులకు విజ్ఞప్తి చేసింది. దాండియా ఆడేందుకు వచ్చేవారి ఆధార్ పత్రాలు తనిఖీ చేయాలని, కేవలం హిందువులను మాత్రమే అనుమతించాలనీ తద్వారా దాండియా వేడుకల సాంస్కృతిక సారాంశాన్ని పరిరక్షించాలనీ కోరింది. ‘‘దాండియా అనేది దుర్గామాతను ఆరాధించే ఒక ప్రత్యేకమైన నాట్య విధానం. అలంటి కార్యక్రమాల దగ్గర భద్రతా పర్యవేక్షణకు బౌన్సర్లుగా హిందూయేతరులను ఏర్పాటు చేయడం ప్రమాదకర పరిణామం’’ అని విహెచ్పి అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ అన్నారు.
హైదరాబాద్‌లోని శంషాబాద్ వద్ద ‘నామ్‌ధారీ గౌరవ్ నవరాత్రి ఉత్సవ్’ పేరిట ఏర్పాటు చేసిన వేడుకల కార్యక్రమంలోకి ముస్లిం యువకులు చొరబడ్డారు. దాండియా ఆడుతున్న హిందూ మహిళలతో వారు తప్పుగా ప్రవర్తించారు. కార్యక్రమ నిర్వాహకులు జోక్యం చేసుకుని వారిని ప్రశ్నించినప్పుడు వారు ముస్లిములని, హిందూ పేర్లతో దొంగతనంగా చొరబడ్డారనీ తెలిసింది. అటువంటి సంఘటనను తీవ్రమైన భద్రతా అంశంగా పరిగణించాలని డాక్టర్ శశిధర్ కార్యక్రమ నిర్వాహకులకు, పోలీసులకు విజ్ఞప్తి చేసారు.
అసలు దాండియా వేడుకల్లోకి ముస్లిములు ఎందుకు చొరబడుతున్నారు, వారి ఉద్దేశాలేంటి అని విహెచ్పి నేత ప్రశ్నించారు. పండుగ వాతావరణాన్ని అడ్డం పెట్టుకుని హిందూ మహిళలకు చేరువ అవడానికి, హిందూ స్త్రీలు బాలికలను వేధించడానికి, లవ్‌జిహాద్‌ను అమలు చేయడానికీ ముస్లిములు ప్రయత్నిస్తున్నారని డాక్టర్ శశిధర్ మండిపడ్డారు. ‘‘ఒక్క హైదరాబాద్‌లోనే కాదు, దేశమంతటా ముస్లిములు తమ మహిళల మీద కఠినమైన నియమాలు రుద్దుతారు. తమ మహిళల మీద తాలిబన్ తరహా ఆంక్షలు విధించడాన్ని సైతం ప్రశంసిస్తుంటారు. కానీ వారే హిందూ పండుగల్లో పాల్గొని హిందూ అమ్మాయిలను లక్ష్యం చేసుకోడానికి మాత్రం వారికి ఎలాంటి అభ్యంతరాలూ ఉండవు’’ అంటూ, హిందూ మహిళలను మతం మార్చడానికి అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తారని ఆరోపించారు.
ఆ సంఘటన జరిగాక భాగ్యనగరంలోని దాండియా కార్యక్రమాల నిర్వాహకులు మేలుకున్నారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తల ఆందోళనలు ఫలించాయి. దాండియా కార్యక్రమాల వేదికల వద్ద నిర్వాహకులు ‘మా వేడుకల్లో తలదూర్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దం’టూ ప్రత్యేకంగా పోస్టర్లు పెట్టారు. దాండియా ఆడాలంటే తిలకం పెట్టుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేసారు. దసరా పండుగ సందర్భంగా నిర్వహించుకునే దాండియా హిందూ సంస్కృతిని ప్రతిఫలిస్తుందని, దాన్ని ఇతర మతస్తులు అవకాశంగా తీసుకునే అవకాశం ఇవ్వకూడదనే చైతన్యం హిందువుల్లో మొదలైంది.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో పబ్బులు, క్లబ్బులు, ప్రైవేటు వేదికల వద్ద టికెట్లు అమ్మి నిర్వహించే దాండియా కార్యక్రమాలు అన్నింటినీ రద్దు చేయాలని ఆ మూడు పీఎస్‌ల అధికారులకూ విహెచ్పి విజ్ఞప్తి చేసింది. అటువంటి వేదికల వద్ద వేడుకల పేరుతో దాండియా నిర్వహించడం వల్ల హిందూ బాలికలు, మహిళల భద్రత ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.