శరన్నవరాత్రుల్లో ఏడవ రోజైన ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గాదేవి శ్రీ సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తిస్వరూపాలలో దుష్టసంహారం చేసిన శ్రీదుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీ అవతారంలో భక్తులను అనుగ్రహిస్తారు.
మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రము. అందువల్ల ఈరోజుకు శరన్నవరాత్రుల్లో అమిత ప్రాధాన్యం ఉంది. త్రిశక్తి స్వరూపిణి నిజస్వరూపాన్ని సాక్షాత్కారింపజేస్తూ శ్వేతపద్మాన్ని అధిష్ఠించిన దుర్గామాత తెలుపు రంగు చీరలో బంగారు వీణ, దండం, కమండలం ధరించి అభయముద్రతో సరస్వతీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. సరస్వతీ దేవిని సేవించడం వల్ల విద్యార్ధినీ విద్యార్ధులు సర్వవిద్యలయందు విజయం పొందుతారు. భక్తులు మూలానక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా భావించి శ్రీ దుర్గమ్మను ఆరాధిస్తారు. అందుకే ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు చదువుల తల్లిగా కొలువుదీరే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకము.
దుర్గమ్మకు కొమరుడు గణపయ్య సారె:
ఇంద్రకీలాద్రిపైనున్న కనకదుర్గాదేవికి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి సారె సమర్పిస్తారు. అందులో భాగంగా మంగళవారం నాడు చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తరపున ప్రత్యేక బృందం శ్రీ మహాలక్ష్మి దేవీ అలంకారంలో ఉన్న అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు.
నేడు అమ్మకు రాష్ట్రప్రభుత్వ సన్మానం:
ప్రతీయేటా మూలానక్షత్రం రోజున రాష్ట్రప్రభుత్వం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ క్రమంలోనే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఆ సమయంలో కూడా మూడు క్యూ లైన్ల ద్వారా అమ్మవారి దర్శనానికి వెసులుబాటు కల్పిస్తామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.