మంత్రి కొండా సురేఖ పై పరువునష్టం దావా వేసిన టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, కోర్టులో అందుకు సంబంధించిన వాంగ్మూలం ఇచ్చారు. నాగార్జున భార్య అక్కినేని అమల, తనయుడు నాగచైతన్య, యార్లగడ్డ సుప్రియ లు నాంపల్లి కోర్టుకు వెళ్ళి న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.
నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. ఆ వ్యాఖ్యలను ఖండించిన నాగార్జున, కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీంతో నాంపల్లి కోర్టు ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. అనంతరం పిటీషన్ విచారణను ఈ నెల 10కి కోర్టు వాయిదా వేసింది.
పిటీషన్ దాఖలు చేయడంపై నాగార్జునను న్యాయస్థానం వివరణ కోరింది. తన కుటుంబంతో పాటు నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి సురేఖ అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కోర్టుకు నాగార్జున తెలిపారు.
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో తమ కుటుంబ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లిందని ఆయన న్యాయమూర్తికి తెలిపారు.
రాజకీయ దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారని, టీవీ ఛానళ్లలోనూ ఇది ప్రసారమైందని వెల్లడించారు. తమపై అసత్య ఆరోపణలు చేసిన ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వాంగ్మూలం సందర్భంగా కోరారు.
కేటీఆర్ పై ఆరోపణలు చేసిన కొండా సురేఖ, వాటిని నాగార్జున, సమంత, నాగచైతన్యకు ముడిపెడుతూ మాట్లాడింది. దీనిపై అక్కినేని కుటుంబంతో పాటు తెలుగు సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.