ఆర్జి కర్ ఆసుపత్రి ఘటన విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూనియర్ వైద్యురాలు హత్యాచారం తరవాత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదంటూ ఇవాళ 50 మంది సీనియర్ డాక్టర్లు రాజీనామా చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ గత రెండు రోజులుగా జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. వారికి మద్దతుగా ఇవాళ 50 మంది సీనియర్ వైద్యులు మూకుమ్మడి రాజీనామాకు దిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆగస్ట్ 9న కోల్‌కతాలోని ఆర్జి కర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనానికి దారితీసింది. తరవాత డాక్టర్లు 42 రోజులపాటు నిరసనలు తెలిపారు. సీఎం మమతా బెనర్జీ హామీ మేరకు నిరసన విరమించి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఆసుపత్రుల్లో రక్షణ పెంచుతామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరక పోవడంతో జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. రాత్రి వేళల్లో మహిళా డాక్టర్లకు రక్షణగా మహిళా పోలీసులను నియమించాలని, ఆసుపత్రుల్లో పోలీసులను నియమించాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.