కర్ణాటక సంగీత విదుషీమణి ఎంఎస్ సుబ్బులక్ష్మి పేరిట నెలకొల్పిన పురస్కారాన్ని టిఎం కృష్ణకు ప్రకటించడం మీద రగడ కొనసాగుతూనే ఉంది. సుబ్బులక్ష్మి మనవడు వి శ్రీనివాసన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. టిఎం కృష్ణకు సంగీత కళానిధి ఎంఎస్ సుబ్బులక్ష్మి పురస్కారం ప్రదానం చేయకుండా మద్రాస్ సంగీత అకాడెమీని నిలువరించే విసయంలో జోక్యం చేసుకోవాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.
2005 నుంచి హిందూ దినపత్రిక గ్రూప్, సంగీత అకాడెమీ సంయుక్తంగా ఇచ్చే సంగీత కళానిధి అవార్డు కర్ణాటక సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకమైనదిగా పేరు గడించింది. పురస్కార గ్రహీతకు సంగీత కళానిధి బిరుదు, లక్షరూపాయల నగదు బహుమతి ఇస్తారు. సంగీత అకాడెమీ యేటా డిసెంబర్‌లో నిర్వహించే సంగీత కార్యక్రమాల్లో భాగంగా ఆ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
సుబ్బులక్ష్మి మనవడు శ్రీనివాసన్ ఆమె పేరిట నెలకొల్పిన అవార్డును టిఎం కృష్ణకు ఇవ్వడాన్ని, భక్తి పురస్కారాన్ని నాస్తికుడికి ఇవ్వడంతో పోల్చారు.
టిఎం కృష్ణ ఎంఎస్ సుబ్బులక్ష్మిని చాలా నీచంగా, అవమానకరంగా నిందిస్తూ ఆమెపై దాడులు చేసాడని శ్రీనివాసన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కృష్ణ రాసిన ఒక వ్యాసంలో సుబ్బులక్ష్మిని ‘ఇరవయ్యవ శతాబ్దపు అతిపెద్ద మోసం’ అని దూషించాడు. మరోసందర్భంలో ‘పవిత్రమైన బార్బీ బొమ్మ’ అని అపహాస్యం చేసాడు. అలాంటి ఉదాహరణలను ప్రస్తావిస్తూ జాతి గర్వించదగ్గ కళాకారిణిని అపఖ్యాతి పాలుచేయాలనే దురుద్దేశంతోనే టిఎం కృష్ణ ఎంఎస్‌ను తీవ్రంగా దూషించాడని ఆమె మనవడు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ యేడాది మొదట్లో మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ ఈ యేటి సంగీత కళానిధి పురస్కారానికి టిఎం కృష్ణను ఎంపిక చేసినట్లు ప్రకటించినప్పుడే తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తాయి. పలువురు కళాకారులు తమ సంగీతకళానిధి పురస్కారాలను వెనక్కు ఇచ్చేసారు.