***************************************************
(శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక)
రచన : కీ.శే పురాణపండ రామమూర్తి
***************************************************
అంబికా విజయాన్ని వినాలనే ఆసక్తితో కూర్చున్నారు సురథ సమాధులు. వారి ఆసక్తిని గమనించాడు మేధాఋషి. తనలో తానిలా అనుకున్నాడు. ఉత్తమశ్లోకగుణానుకీర్తనం చేసేటప్పుడు వినేవారు శ్రద్ధగా వింటే ప్రమాణబుద్ధితో గ్రహిస్తే గ్రహించింది మననం చేసుకుంటే శ్లోకం శ్లోకంగా ఉంటుంది. అలాగాక వినేవారు ప్రమాణబుద్ధి లేనివారై శ్రద్ధ, భక్తి యనునవి లేనివారై కుతర్కం చేసేవారైతే శ్లోకంలో ‘ల’కారం పోయి శోకం మిగులుతుంది. చెప్పేవాడుంటే వినేవాడు ఉండడు. వినేవాడుంటే చెప్పేవాడు ఉండడు. ఇద్దరూ ఒకచోట చేరడం దుర్ఘటం. జగన్మాత కరుణచే నాకు సత్పురుషులు శ్రోతలుగ లభించారు. శ్రవణభక్తిచే వారును సంకీర్తనభక్తిచే నేనును తరింతుముగాక యనుకున్నాడు ఆ మహాజ్ఞాని.
వీరిరువురును గూడ తమలోతాము ఇట్లనుకొన్నారు. ‘ఆహా! మన జన్మలు ధన్యమైనాయి. మనకీ క్లేశ సమయంలో సద్గురువు లభించాడు. సద్గురులాభము చాల దుర్లభమైనది. గురువులు చాలమంది ఉంటారు ప్రపంచంలో. శిష్యుని విత్తాన్ని హరించేవారు గురువులలా బయలుదేరి మోసం చేస్తారు. శిష్యుని హృదయతాపాన్ని హరించే గురువు కావాలంటే వెతుక్కోవాలి. జగన్మాత అనుగ్రహం వల్ల మనకు సద్గురువు లభించాడు’ అని వారిద్దరూ ఆనందిస్తున్నారు.
మహర్షి కథా ప్రారంభం చేయడానికి జగన్మాత ధ్యానం ప్రారంభించాడు. ‘‘ఈ ఉత్తమ చరిత్రకు ఋషి రుద్రుడు, మహాసరస్వతి దేవత, ఛందస్సు అనుష్ఠుప్, క్రియాశక్తి, భ్రామరీ బీజం, సూర్యతత్త్వం, సామవేద స్వరూపం, మహాసరస్వతీ ప్రసాదమే ఈ చరిత్రకు వినియోగం. ఏ మహాశక్తి తన కరకమలములయందు ఘంట, శూలము, హలము, శంఖము, ముసలము, చక్రము, ధనస్సు, బాణము అనువానిని ధరించిందో; ఏ మహామాత శరత్కాల చంద్రునితో సమానమైన కాంతి కలదో; ఏ మహాసరస్వతి మూడులోకాలకూ ఆధారభూతమైనదో; ఏ జగజ్జనని లోక కళ్యాణార్థం శుంభనిశుంభాది రక్కసుల సంహరించిందో; ఏ మహావిద్యాస్వరూపిణి గౌరీదేహంలోనుండి ఉద్భవించిందో; అట్టి మహాసరస్వతిని నిరంతరము భజించుచుందును’’ అని యీరీతిగ మహాసరస్వతిని ధ్యానించాడు మహర్షి. నిమీలితలోచనుడై ముహూర్తకాలం చిచ్ఛక్తిని ధ్యానించాడు. చరిత్రను చెప్పడం ప్రారంభించాడు.
ఓ వత్సలారా! పూర్వకాలంలో శుంభనిశుంభులనే ఘోరరాక్షసులు జనించారు. తపశ్శక్తిచే అపారబలం సంపాదించారు. బలగర్వంచే దురాక్రమణ ప్రారంభించారు. ఇంద్రునిపై దాడికి వెడలారు. సర్వదిక్పాలురతోకూడ ఇంద్రుని జయించారు. త్రిలోకాధిపత్యం వహించారు. యజ్ఞభాగాలన్నీ రక్కసులే గ్రహిస్తున్నారు. సూర్య, చంద్ర, వరుణ, వాయు, కుబేర, యమ, అగ్ని మొదలగు సమస్త దేవతల అధికారాలు తామే గ్రహించారు. ఆయాస్థానములలో రాక్షసులను నియమించారు. లోకాల్లో ఆసురీశక్తి వృద్ధిపొందింది. సాత్త్వికానికి స్థానం లేదు.
దేవతలు అపజయం పొంది అవమానితులై రాజ్యభ్రష్టులై అధికారహీనులైరి. స్వర్గభ్రష్టులై అరణ్యాలపాలైనారు. చేయునది లేదు. సర్వశక్తులూ ఉడిగాయి. పరమేశ్వరి స్మరణకు వచ్చింది. మహిషాసుర సంహారకాలంలో జగన్మాత తమకిచ్చిన వరం జ్ఞాపకం వచ్చింది. సమానక్లేశంలో ఉన్న దేవతలందరినీ ఒకచో సమావేశం చేసాడు ఇంద్రుడు. ‘ఓ దేవతలారా! పూర్వము మనకు మహిషాసురమర్దినియగు మహాలక్ష్మి వరమిచ్చింది. ఆపత్కాలంలో నన్ను స్మరిస్తే నేను ప్రసన్నురాలనై మీ ఆపదలు పోగొడతానంది. గాన మనం ఏకాగ్రదృష్టితో జగదంబను స్మరించాలి. అంతకంటె ఈ సమయంలో వేరు సాధనం లేదు’ అని చెప్పాడు ఇంద్రుడు. దేవతలంతా అంగీకరించారు. హిమాలయ పర్వతాన్ని చేరారు. మహావిష్ణుమాయను స్తుతించడం ప్రారంభించారు.
శ్రీదేవికి నమస్కారము. మహాదేవికి నమస్కారము. శివాస్వరూపురాలికి నమస్కారము. ప్రకృతి మరియు భద్రకు నమస్కారము. మేము నియమపూర్వకముగా మహాదేవికి నమస్కరిస్తున్నాము. రౌద్రికి నమస్కారము. నిత్యాదేవికి నమస్కారము. గౌరికి నమస్కారము. ధాత్రికి నమస్కారము. జ్యోత్స్నామయికి నమస్కారము. ఇందురూపిణికి నమస్కారము. సుఖస్వరూపిణికి నిరంతరము నమస్కారము. శరణాగతులకు నిరంతరము కళ్యాణాన్ని చేకూర్చే వృద్ధి, సిద్ధి రూపురాలైన దేవికి మాటిమాటికి నమస్కరించుచున్నాము. నైఋతీ శక్తికి, రాజ్యలక్ష్మికి, శర్వాణీ స్వరూపురాలైన జగదంబకు నమస్కరించుచున్నాము. దుర్గకు, దుర్గమమైన క్లేశముల నుండి దాటించిన శక్తికి, సమస్త సారభూతమైన దేవికి, సమస్తమును చేయుదానికి, ఖ్యాతికి, కృష్ణకు, ధూమ్రాదేవికి నమస్సులు. అత్యంతము సౌమ్యరూపిణియు, అట్లే రౌద్రరూపిణియునగు దేవికి వందనములు. జగదాధారభూతమైన కృతిదేవికి నమస్కారము. ఏ దేవి సమస్తప్రాణులయందును విష్ణుమాయ అనుపేరుతో చెప్పబడుతోందో అట్టి శక్తికి నమస్కారము. ఆ మాయకు మాటిమాటికి నమస్కారము. ఏ దేవి సమస్తజీవులయందును చైతన్యశక్తి యని పిలవబడుతోందో; ఏ దేవి సమస్తజీవులయందును బుద్ధిరూపంగా ఉందో; ఏ దేవి సమస్తజీవులయందును నిద్ర-ఆకలి-ఛాయ-శక్తి-తృష్ణ-క్షమ-జాతి-లజ్జ-శాంతి-శ్రద్ధ-కాంతి-లక్ష్మి-వృత్తి-స్మృతి-దయ-తుష్టి రూపాలలో ఉన్నదో; అట్టి రూపాలు గల జగదంబకు నమస్కారము, ఆ మాతకు నమస్కారము. ఆ మహాసరస్వతికి మాటిమాటికీ నమస్కారము. ఆ విష్ణుమాయకు నమస్కారము. ఏ దేవి సమస్త జీవులయందును మాతృరూపములో ఉందో అట్టి మహామాతకు నమస్కారము. ఏ దేవి సమస్త ప్రాణులయందును భ్రాంతిరూపంగా, ఇంద్రియాధిష్టానరూపంగా, సర్వవ్యాపకరూపంగా ఏ చైతన్యశక్తి వ్యాప్తి చెందియున్నదో; ఆ మహావ్యాప్తిరూపిణికి నమస్కారము. ఆ చైతన్యరక్తికి నమస్కారము. ఆ చిచ్ఛక్తికి నమస్కారము. ఆ మహామాయకు మాటిమాటికీ నమస్కారము. పూర్వకాలంలో అభీష్టం నెరవేరడానికిగాను దేవతలు ఏ శ్రీదేవిని స్తుతించారో; ఏ మాతను ఇంద్రుడు చిరకాలం సేవించాడో; ఆ కళ్యాణ సాధనభూతురాలైన మహామంగళ మాకు మంగళములు చేకూర్చుగాక! మా సమస్త ఆపత్తులను నివారించుగాక! ఉద్దండులగు రాక్షసులచే బాధింపబడు మేము ఏ పరమేశ్వరికి ఈ సమయంలో నమస్కరించుచున్నామో; శుద్ధస్వాభావికం గల పురుషులు వినమ్రులై నమస్కరించినంత మాత్రాన ఆ సమయంలోనే సమస్త క్లేశములను హరించి సమస్త కోర్కెలను నెరవేర్చే మహామాత మా కష్టములు రూపుమాపుగాక! మాకు కళ్యాణములు చేకూర్చుగాక! యని యీరీతి దేవతలు స్తుతించారు.