ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన దాడుల్లో హమాస్ అధినేత యహ్యా సిన్వార్ హతమయ్యాడని అంతర్జాతీయ మీడియా కోడై కూసింది. గత నెల 21న ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సిన్వార్ చనిపోయి ఉంటాడని ఐడీఎఫ్ కూడా అనుమానించింది. సిన్వార్ మరణించి ఉంటాడని అనేక వార్తలు వచ్చినా అతను స్పందించలేదు. దీంతో హమాస్ అధినేత చనిపోయాడమే వార్తలకు బలం చేకూరింది. అయితే తాజాగా ఖతర్‌కు చెందిన దౌత్యవేత్త ఒకరు సిన్వార్ సజీవంగా ఉన్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
యహ్యా సిన్వార్ గత ఆగష్టులో హమాస్ అధినేతగా ఎన్నికయ్యారు. గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై జరిగిన భీకర దాడులకు సిన్వార్ ప్రణాళిక రచించాడని ఐడీఎఫ్ అనుమానిస్తోంది. హమాస్,హెజ్బొల్లా అగ్రనేతలను ఇప్పటికే మట్టుబెట్టిన ఇజ్రాయెల్ తన దాడులను మరింత ముమ్మరం చేసింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మరో వారంలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ పూర్తిస్థాయి దాడులు ప్రారంభించే అవకాశం లేకపోలేదని అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది.