ఇటీవల జరిగిన హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఇవాళ తేలిపోతాయి. మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం ప్రధాన పార్టీలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. జమ్మూకశ్మీర్‌లో ఇరుపక్షాల మధ్యా హోరాహోరీ పోరు ఉండవచ్చు. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి కొద్దిగా ఆధిక్యం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
రెండు రాష్ట్రాల్లోనూ చెరో 90 నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో గెలవాలంటే కనీసం 46 సీట్ల మెజారిటీ సాధించాలి. జమ్మూకశ్మీర్‌లో లెఫ్టినెంట్ గవర్నర్‌కు మరో ఐదుగురు సభ్యులను నామినేట్ చేసే అధికారం ఉంది. దాన్ని బీజేపీ అవకాశంగా వాడుకుంటుందని ప్రత్యర్ధి పార్టీలు ఆరోపిస్తున్నాయి.
హర్యానాలో బీజేపీ గతరెండుసార్లుగా అధికారంలో ఉంది. ఇప్పుడు కూడా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే పదేళ్ళ బీజేపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. జాట్లలో అసంతృప్తి, వ్యవసాయ చట్టాల నేపథ్యంలో రైతుల్లో ఆగ్రహం కూడా బీజేపీ విజయావకాశాలను దెబ్బతీస్తాయని అంచనాలున్నాయి.
హర్యానాలో బీజేపీకి జాటేతర సమూహాల మద్దతు ఉండేది. ఈషారి ఆ సమూహాలు బీజేపీని దూరం పెట్టాయని చెబుతున్నారు. గతంలో బీజేపీ జాట్ల మద్దతు బలంగా ఉండే పార్టీతో పొత్తులో ఉండేది కానీ ఈసారి ఒంటరిగా పోటీ చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల ముందు దుష్యంత్ చౌతాలా ‘జననాయక్ జనతా పార్టీ’తో పొత్తును వదిలేసుకుంది. దాంతో ఆ పార్టీకి నిలకడగా పడే ఓట్లంటూ లేకుండా పోయాయని అంచనా వేస్తున్నారు.
జమ్మూకశ్మీర్ విషయానికి వస్తే 2019లో ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370వ రాజ్యాంగ అధికరణాన్ని రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. గత పదేళ్ళలో చాలాకాలం జమ్మూకశ్మీర్ రాష్ట్రపతి పాలనలోనే ఉంది. ఆ తర్వాత మొదటిసారి జరుగుతున్న ఎన్నికలివి. గత ఐదేళ్ళలో జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న శాంతి, జరిగిన అభివృద్ధితో ప్రజలు తమవైపు ఉంటారని బీజేపీ చెబుతోంది. తాము గెలిస్తే రాష్ట్రహోదాను పునరుద్ధరిస్తామన్న వాగ్దానం కూడా తమకు లాభిస్తుందని భావిస్తోంది.
జమ్మూ ప్రాంతంలో 43 నియోజకవర్గాలు, కశ్మీర్ ప్రాంతంలో 47 నియోజకవర్గాలూ ఉన్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఐదుగురు ఎంఎల్ఎలను నామినేట్ చేసే అధికారం ఉంది. ఇక్కడ ఎన్నికల పోరు నువ్వానేనా అన్నట్లు ఉంది. దాంతో ఫలితాలు ఏమాత్రం అటూఇటూగా వచ్చినా, లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసే ఐదుగురు ఎంఎల్ఎలతో, ప్రజాభిప్రాయాన్ని బిజెపి తమకు అనుకూలంగా మలచుకుంటుందని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి.
జమ్మూకశ్మీర్ కేంద్రపాలితప్రాంతంలో నియోజకవర్గాల సంఖ్యను డీలిమిటేషన్ కమిషన్ పెంచింది. ఆ తర్వాత, మరో ఐదుగురు ఎంఎల్ఎలను నామినేట్ చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్‌కు అవకాశం కల్పించింది. ఇద్దరు మహిళలు, ఇద్దరు కశ్మీరీ పండిట్లు, పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఒకరు… అలా ఐదుగురిని నామినేట్ చేయవచ్చు. దానివల్ల మొత్తం ఎంఎల్ఎల సంఖ్య 95కు పెరుగుతుంది.
ఎంఎల్ఎల నామినేషన్ అంశాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అది ప్రజాస్వామ్యంపైనా, ప్రజల తీర్పుపైనా, రాజ్యాంగపు ప్రాథమిక సూత్రాలపైనా దాడి అని కాంగ్రెస్ మండిపడుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ ఐదుగురు ఎంఎల్ఎలను నామినేట్ చేస్తే సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటించింది. అసలు లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఆ అధికారం ఇవ్వడం ఎన్నికలను ముందుగానే రిగ్గింగ్ చేయడమే అని పీడీపీ మండిపడుతోంది.
జమ్మూకశ్మీర్‌లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అక్కడ కశ్మీరీ పండిట్లకు, పాక్ ఆక్రమిత కశ్మీర్ వాసులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించడమే ఈ నామినేటెడ్ ఎంఎల్ఎల పద్ధతి లక్ష్యమని బీజేపీ సమర్థించుకుంటోంది.