ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవములలో ఆరవ రోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి మంగళవారం అయిన ఇవాళ శ్రీమహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. సర్వమంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి భక్తుల జీవితాలను మంగళప్రదం చేస్తారు.
జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుత ఘట్టము. మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీమహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించారు. లోకస్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజ లక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్ముల సమష్టి రూపమైన అమృతస్వరూపిణిగా శ్రీదుర్గమ్మ ఈరోజు మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు.
“యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే సమస్త జీవుల్లోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీసప్తశతి చెబుతోంది. ఈ శరన్నవరాత్రుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి సర్వమంగళ కారిణిగా సమస్త భాగ్యాలనూ ప్రసాదిస్తారు. శ్రీమహాలక్ష్మీదేవి అమ్మవారిని దర్శించి అర్చించి పూజించడం వలన భక్తులకు ఐశ్వర్యము, విజయము ప్రాప్తిస్తాయి.