సింహాసనగతా నిత్యం పద్మాంచిత కరద్వయా
శుభదాస్తు సదా దేవా స్కందమాతా యశస్వినీ
శ్రీశైలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదిపరాశక్తి నవ దుర్గా రూపాల్లో ఐదో అలంకారంగా స్కందమాత ను పూజిస్తారు. నవరాత్రుల్లో భాగంగా ఐదోరోజున ఈ దేవిని ఆరాధిస్తారు. ఈ అలంకారంలో భాగంగా అమ్మవారి ఒడిలో బాలుడు ఉంటాడు. బాలుని రూపంలో కుమారస్వామి కూర్చొని ఉంటాడు. దీంతో ఈ పరాశక్తిని పూజిస్తే కుమార స్వామిని ఆరాధించిన ఫలితం కూడా లభిస్తుంది.
దేవి చతుర్భుజాలలో పై రెండు చేతులు పద్మాలు కలిగి ఉండి, కుడివైపున కింది చేయి అభయ హస్తంగాను ఎడమ చేతితో ఒడిలోని కుమారస్వామిని పట్టుకుని అమ్మవారు దర్శనమిస్తారు. స్కందదేవుని జనని కావడంతో అమ్మవారిని స్కందమాతగా కొలుస్తారు. ఈ దేవిని పూజిస్తే కోరిన కోర్కెలు తీరడంతో పాటు కుమారస్వామి ఉపాసనా ఫలితం కూడా భక్తులకు లభిస్తుంది.
నేడు గ్రామోత్సవంలో భాగంగా ఆదిదంపతులు శేష వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు. స్వామి అమ్మవార్ల ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.