అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్కున్ 2024 సంవత్సరానికి వైద్యరంగంలో నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. మైక్రోఆర్ఎన్ఎను, జన్యు నియంత్రణలో దాని పాత్రను కనుగొన్నందుకు వారికి ఈ అవార్డు ఇస్తున్నట్లు నోబెల్ అకాడెమీ ప్రకటించింది.
వైద్యరంగంలో నోబెల్ విజేతలను నోబెల్ అసెంబ్లీ ఆఫ్ స్వీడన్స్ కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ మెడికల్ యూనివర్సిటీ ఎంపిక చేసింది. వారికి 11 మిలియన్ల స్వీడిష్ క్రౌన్లు అంటే 1.1 మిలియన్ అమెరికన్ డాలర్ల నగదు బహుమతి లభిస్తుంది.
ఇవాళ వైద్యరంగంలో పురస్కార విజేతల ప్రకటనతో ఈ యేటి నోబెల్ బహుమతుల ప్రకటనలు మొదలయ్యాయి. సైన్స్, సాహిత్యం, మానవత్వ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పురస్కారాలుగా నోబెల్ అవార్డులను పరిగణిస్తారు. ఈ అవార్డులను 1901 నుంచీ ప్రదానం చేస్తున్నారు.