ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఈ మధ్యాహ్నం బయల్దేరిన చంద్రబాబు, దేశ రాజధాని చేరుకున్నాక మొదటగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. తర్వాత రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో సమావేశం అవుతారు.
మంగళవారం చంద్రబాబు తొలుత కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చలు జరుపుతారు. అదేరోజు సాయంత్రం పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరీని కలుసుకుంటారు. రాత్రి హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో భేటీ అవుతారు.
ప్రధానితో సమావేశంలో చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరం, విశాఖ రైల్వేజోన్, సెయిల్‌లో విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనం, వరద నష్టాలకు కేంద్రసాయం వంటి అంశాలపై చర్చలు జరుపుతారని సమాచారం. వాటితో పాటు విభజన హామీలను కూడా ప్రస్తావిస్తారని తెలుస్తోంది.
రాష్ట్రంలో ఇటీవల అత్యంత సంచలనాత్మకంగా మారిన తిరుమల లడ్డూ తయారీలో కల్తీనెయ్యి వ్యవహారం గురించి కూడా చంద్రబాబు ప్రధానమంత్రితో మాట్లాడే అవకాశముంది.