పాకిస్తాన్ లోని కరాచీ ఎయిర్ పోర్టులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు చైనా పౌరులు చనిపోగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు పదార్థాలు అమర్చిన ట్యాంకర్ పేలిపోయింది. గాయపడిన వారిలో నలుగురు సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు. క్షతగాత్రులకు జిన్నా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఘటనను విదేశీ పౌరులపై జరిగిన దాడి అని సింధ్ రాష్ట్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. విదేశీ పౌరులే లక్ష్యంగా దాడి జరిగింది. పేలుడు చాలా పెద్దది కావడంతో విమానాశ్రయ భవనాలు కంపించినట్లు పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ అధికారి రాహత్ హుస్సేన్ తెలిపారు. సింధ్ రాష్ట్ర సీఎం మురాద్ అలీ షా ఈ ఘటనపై సమగ్ర నివేదిక కోరారు.
పేలుడు కుట్రకు పాల్పడింద తమేనని వేర్పాటువాద మిలిటెంట్ గ్రూప్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. ఈ మేరకు ఈ-మెయిల్ ప్రకటన విడుదల చేసింది. చైనా జాతీయులు లక్ష్యంగా పేలుడు పరికరాన్ని అమర్చామని స్పష్టం చేసింది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌లతో సరిహద్దులు పంచుకుంటున్న బలూచిస్తాన్ ప్రావిన్స్‌కు స్వాతంత్య్రం ప్రకటించాలని బలూచ్ లిబరేషన్ ఆర్మీ పోరాడుతోంది.