ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తమిళనాడు పోలీసులకు ఓ న్యాయవాది ఫిర్యాదు చేశాడు. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కల్తీ గురించి తిరుపతి వారాహి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను ఫిర్యాదులో సదరు న్యాయవాది ప్రస్తావించాడు.
వారాహి డిక్లరేషన్ పేరిట తిరుపతిలో సభలో పవన్ కళ్యాణ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, మత కలహాలకు దారితీసేలా మాట్లాడారంటూ మధురై పోలీసు కమిషనర్ ఆఫీస్‌లో వాంజినాథన్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న ఆయన ఈ ఫిర్యాదు చేశారు. మైనారిటీలు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ను ఉద్దేశించి కూడా పవన్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పవన్ మాటలు ముస్లిం, క్రైస్తవులను రెచ్చగొట్టడంతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రజల మధ్య పగ, విద్వేషాలకు ఆస్కారం ఉందని వాంజినాథన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను రుపతి సభలో పవన్ ప్రస్తావించారు. దీనిని కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు.
సనాతన ధర్మం వైరస్ లాంటిదని దానిని పూర్తిగా నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ గతంలో వ్యాఖ్యానించారు. దీనిపై పలు చోట్ల కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ వ్యాఖ్యలను తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. అలా మాట్లాడటం తగదని హితవు పలికారు.