అరంగేట్రంలోనే అదరగొట్టిన మయాంక్ యాదవ్
బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ విజయం సాధించింది. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
గ్వాలియర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులు మాత్రమే చేయగల్గింది. భారత్ 128 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా సాధించింది. కేవలం 11.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 132 పరుగులతో విజయాన్ని నమోదు చేసింది.
హార్దిక్ పాండ్యా 16 బంతులు 39 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. తెలుగుకుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (16) పరుగులు చేశాడు. ఓపెనర్ సంజు శాంసన్ (29)కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( 29) రాణించారు. అభిషేక్ శర్మ 16 పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరిగాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజూర్ రెహ్మాన్ , మెహిదీ హసన్ మిరాజ్ చెరొక వికెట్ తీశారు.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో మెహిదీ హసన్ మిరాజ్( 35) టాప్ స్కోరర్ గా ఉండగా , కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో( 27) రాణించాడు. భారత బౌలర్లలో అర్షదీప్ , వరుణ్ చెరో మూడు వికెట్లు తీశారు. మయాంక్ యాదవ్ , వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా తలా ఒక వికెట్ తీశారు.
పాకిస్తాన్, భారత్ లు టీ20ల్లో మొత్తం 42 సార్లు ప్రత్యర్థులను ఆలౌట్ చేశాయి. మూడో స్థానంలో న్యూజీలాండ్ అత్యధికంగా 40 సార్లు ప్రత్యర్థులను ఆలౌట్ చేసి విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ అక్టోబరు 9న దిల్లీ వేదికగా జరగనుంది.