***************************************************
(శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక)
రచన : కీ.శే పురాణపండ రామమూర్తి
***************************************************
ఓ అనఘులారా వినుడు. యీరీతి శ్రీదేవిచే సైన్యాలన్నీ నిహతమైపోవడం చూచాడు చిక్షురుడు. క్రోధోన్మత్తుడై దేవిపై బాణవృష్టి కురిపిస్తున్నాడు. దేవి భూతభయంకరమైన సింహనాదం చేసి శంఖం పూరించి ధనుష్ఠంకారం చేసింది. చిక్షురునిచే కురిపించబడు బాణవృష్టిని రూపుమాపుతోంది. పైగా సారధిని చంపింది. రథం ముక్కలు చేసింది. అశ్వాలను హతమొనర్చింది. శూలాన్ని తుత్తునియలు గావించింది. గదను గదాఘాతంచే చూర్ణం చేసింది. పరశు భిండివాల తోమర పరిఘాద్యాయుధాలను నిష్ఫలం చేసి ఖడ్గపాణియై తనపైకి ఉరుకు చిక్షురుని శిరస్సును మొండెంతో వేరు చేసింది. సైన్యాధిపతి మరణానికి చామరుని క్రోధం వృద్ధిపొందింది. ముందుకొచ్చాడు. ముహూర్తమాత్రంలో చామరుడు కూడ చిక్షురుణ్ణి కలుసుకున్నాడు. ఉదగ్రుడు ప్రారంభించాడు దేవితో యుద్ధం. క్షణకాలంలో ఉగ్రమూర్తియగు దేవి చేతిలో నిహతుడైనాడు. ఇట్లే బిడాలుడు, అసిలోముడు, కాలుడు, మహాహను, తామ్ర, అంధక, ఉగ్రాస్య, ఉగ్రవీర్యాది మహాదానవులందరూ అగ్నికభిముఖములై శలభములు తుదకు అగ్నికాహుతి యైనట్లే జగదంబ క్రోధాగ్నిజ్వాలలకెదురై తమతమ ఘోరకాయాలు మహాశక్తి ప్రతాపాగ్నికాహుతి చేసారు.
రథ గజ తురగ పదాతి సైన్యాలతో సైన్యాధిపతులతో కూడ సర్వసైన్యాధిపతి మరణించడం గమనించాడు మహిష దానవుడు. ఉగ్రుడైనాడు. సర్వసైన్యాలు నిర్మూలమైపోయాయి. ‘‘నేను సజీవుడనై చూస్తుండగానే సర్వనాశనమై పోయింది అసురబలం. ఇంక నేనున్నాను. నా సర్వశక్తులూ వినియోగిస్తాను. జయించానా సర్వాధిపత్యం వహిస్తాను, మరణించానా చిచ్ఛక్తిలో కలుస్తాను. ఎటైనా మేలే’’ అనుకున్నాడు. మహిష రూపాన్ని ధరించాడు. సింహనాదం చేసాడు. పదఘట్టన చేస్తున్నాడు. వాలవిక్షేపం గావిస్తున్నాడు. కొమ్ములతో పర్వతాలు సమూలంగా లేవగొట్టి విసిరేస్తున్నాడు. అనంతకోటిసంఖ్యాకములైన దేవియొక్క శక్తిగణాలను భయకంపితులను చేసేసాడు. పాదాలతో కొందరిని, తోకతో కొందరిని, కొమ్ములతో కొందరిని, ఈ రీతిగ శక్తిగణాలను సంపూర్ణంగ చిందరవందర చేసేసాడు.
దేవి వినా ఇతరులెవ్వరూ మహిషుని భయంకర రూపాన్ని చూడలేకున్నారు. పదఘట్టన మాత్రం చేత భూమండలం బీటలు తీస్తూంది. వాలవిక్షేపంచే సముద్రాలు చెలియలికట్టలు దాటి భూమిమీదకొస్తున్నాయి. కొమ్ములతో విసురుతే పర్వతాలు ఆకాశంలో బంతుల్లా తిరుగుతున్నాయి. బీభత్సభయానకరౌద్రాది రసాలు మూర్తీభవించాయా అన్నట్టుగా ఉంది మహిషాసుర కృత్యం. బ్రహ్మాది దేవతలు నిర్విణ్ణులై చూస్తున్నారు. దేవతలు భయకంపితులై చిత్రప్రతిమలలా ఆకాశంలో నిలబడ్డారు. మహిషాసురుడు వికటాట్టహాసం చేస్తూ ఇటునటు ఉరకడంలో శిరస్సు పైకెత్తి ఆడిస్తుంటే మేఘాలు ముక్కలై పడుతున్నాయి. మహాపరాక్రమవంతుడే గాక మహిషాసురుడు శాంబరీవిద్యా ధురంధరుడు కూడా. అనేక మాయలు పన్నుతున్నాడు.
అదంతా చూచింది జగదంబ. ‘‘పరిమితమగు మాయనాధారంగా చేసుకుని మహామాయను, నన్ను జయించాలనుకుంటున్నాడే. క్రూరుడు, దేవద్వేషి యగు వీనిని నేనే సంహరింతును గాక’’ యనుకుంది మహామాత. మహిషునితో యుద్ధం ప్రారంభించింది. అనేక దివ్యాయుధాలు నిష్ఫలమౌతున్నాయి. ఒకప్పుడు ఘోరాకారమైన పక్షి రూపంతో ఆకాశంలో చరిస్తాడు. మరొకప్పుడు గజరూపాన్ని ధరించి దేవివాహనమగు సింహాన్నే తుండముతో లాగి సంహరించడానికి ప్రయత్నిస్తాడు. ఇంకొకసారి దేవివాహనంతో సమానమైన సింహరూపాన్ని ధరిస్తున్నాడు. ఈవిధంగా అనేక రూపాలు ధరిస్తూన్నాడు. పర్వతాలు విసురుతున్నాడు. అనేకవిధములగు మాయలతో యుద్ధం చేస్తున్నాడు. మహిషుడొకరూపాన్ని ధరిస్తే ఆ రూపాన్ని ఖండించడానికి ప్రయత్నిస్తోంది ఆదిశక్తి. మరుక్షణంలో ఆ రూపాన్ని మార్చేస్తున్నాడు మహిషదానవుడు.
సమస్త రూపాలు ఉపసంహరించి తిరిగి మహిష రూపాన్ని ధరించి సమస్త లోకాలకూ భయాన్ని కలిగిస్తూ మొదటివలె విజృంభించాడు. ఈసారి ‘ఉంటే మహిషాసురుడు లేకుంటే దేవి’. ఇద్దరూ ఉండడానికి అవకాశం లేదు. అలా తయారైంది యుద్ధరంగం. గర్జిస్తున్నాడు దానవుడు. అంబ పలుకుతోంది. ‘‘ఒరే! మహిషాసురా కాలం సమీపిస్తోంది. గర్జించు. కడసారి గర్జన ముగించు. నేను మధుపానం చేస్తున్నాను. నా మధుపానకాలంలో నీ శక్తి కొలది గర్జించు. నీ సంహారానంతరం నేను గర్జిస్తా’’నన్నది.
దేవి మధుపానం చేసింది. సింహనాదం చేసింది. ఆమె ముఖం మధుపానంచే ఎఱ్ఱవారింది. నేత్రములనుండి అగ్నికణాలు రాలుతున్నాయి. మహిషుని మీదకురికింది. పాదములతో మహిషుని అణచివేసింది. శూలంతో పొడిచింది. ఆ మహిషాసురుడు మహిష దేహంలో నుండి మరొక ఘోరరూపంతో బయలువెడలుతున్నాడు. సగభాగం శరీరం బయటకు వచ్చింది. దేవి అంతతో తన శక్తిచే మిగిలిన శరీరం పైకిరాకుండా నిరోధించింది. సగంశరీరంతో యుద్ధం ప్రారంభించాడు. ఉత్తరక్షణంలో అంబిక మహాఖడ్గంతో మహిషుని శిరమును ఖండించింది. మహిషుడు ప్రాకృతమైన క్రూరకళేబరాన్ని వదలి తేజోరూపుడై మహాతేజమగు మహాశక్తిలో ఐక్యమయ్యాడు.
మహిషుడు మరణించడం చూచి హతశేషులైన రాక్షసులు ‘హా!హా!’కారములతో పలాయితులైనారు. దేవతలు ‘మహిషాసురమర్దినికీ జై!’, ‘మహిషాసురమర్దినికీ జై!’ యంటూ అంబికావిజయరూపమైన నినాదాలు చేసారు. దేవదుందుభులు మ్రోగాయి, గంధర్వులు గానం చేసారు, కిన్నరులు పాడారు, అచ్చరలు నృత్యం చేసారు. పువ్వుల వాన కురిసింది. బ్రహ్మాదులు, ఋషులు దేవిని స్తుతించారు.
నాయనలారా! సమస్తలోక కంటకుడైన మహిషాసుర మరణం వల్ల సమస్త లోకాలు ఆనందించాయి. సాధారణంగా లోకంలో ఒకజీవి మరణిస్తే ‘అయ్యో’ అనిపిస్తుంది. లోకం విచారిస్తుంది. కాని దురాచారపరాయణుడై సమస్త జీవులను హింసించడం చేత మహిష దానవుని మరణానికి సమస్త భూతాలు ఆనందించాయి. శక్తివంతుడు గాన తన శక్తిని దుర్వినియోగం చెయ్యకూడదు. ఓ వత్సలారా! మహదానందంచే ఓలలాడుతూ దేవతలు మహర్షులు కలసి జగదంబను స్తుతించడం ప్రారంభించారు. తొలుత దేవిని యిలా ధ్యానించారు, ‘కాలమేఘంతో సమానమైన వర్ణం కలిగి, కటాక్ష వీక్షణముల మాత్రం చేత శత్రువులను భయకంపితులనొనర్చునదియును, శంఖ చక్ర కృపాణ త్రిశూలాద్యాయుధధారిణియును, మూడునేత్రములు కలదియును, కిరీట కటక కేయూరాద్యాభరణములు ధరించినదియును, కిరీటమున బాలచంద్రలాంఛనము కలదియును, సింహవాహనయు, తన ప్రకాశముచే మూడులోకములకు కాంతిని ప్రసాదించునదియును, ‘జయా’ నామధారిణియగు దుర్గను ధ్యానించుచున్నాము.
దేవతలు అంబను ధ్యానించి శిరము వంచి చేతులు జోడించి స్తుతి చెయ్యడం మొదలుపెట్టారు. ఓ జగజ్జననీ! లోకమాతా! మధుకైటభ ప్రశమనీ! మహిష మర్దినీ! నీ కరుణారస ప్రవాహములో పడిన జీవులు నిరతిశయానందమును పొందగలరు. నీవు సమస్త దేవతాస్వరూపిణివి. నీవు చూచిన మాత్రమున బ్రహ్మాండకోటులు జనిస్తున్నాయి. నీవు కన్నుమూసిన మాత్రాన నశించిపోతున్నాయి. నీ సంకల్పమే జగత్కళ్యాణము. సమస్త జగదాధారమూర్తివగు నీకు నమస్కారము. సమస్త దేవతాశక్తి సముదాయము ఏ దేవీరూపమో! ఏ దేవి తన శక్తిచే సమస్త జగత్తును వ్యాప్తి చేసిందో! సమస్త దేవతలకు, మహర్షులకు పూజనీయమైనదో అట్టి జగదంబకు నమస్కారము. ఓ జగదంబా! నీవు మోక్షప్రాప్తికి ప్రధాన సాధనమైనదానవు. మోక్షరూపము నీదే! నీవు సమస్త రాక్షస సంహారమొనర్చి లోకానికి కళ్యాణము చేకూర్చావు. బహిశ్శత్రువులే గాక అంతశ్శత్రువులగు కామక్రోధాదులను కూడ జయించాలంటే జీవికి నీ అనుగ్రహం కలగాలి. సర్వమూ నీ స్వరూపమే. నీకంటె భిన్నమైన వస్తువు ప్రపంచములో లేదు. నీ రూపమిలా ఉంటుందని నిర్ణయించడానికి లేదు. నిన్ను స్త్రీయని గాని పురుషుడని గాని నపుంసకుడని గాని నిర్ణయించడానికి అవకాశం లేదు. నిన్ను సద్వస్తువని గాని అసద్వస్తువని గాని నిర్ణయించ లేకున్నారు జ్ఞానులు. స్వయంప్రకాశ స్వరూపురాలవు. ఉపాసకుల కార్యార్ధమై అనేక రూపాలు ధరిస్తావు. స్వతః నీకు రూపం లేదు. బ్రహ్మవిద్యా స్వరూపురాలవు. బ్రహ్మస్వరూపురాలవు. ‘హ్లాదినీ’శక్తివి. నిరతిశయసుఖ స్వరూపురాలవు అని అనేక రీతులుగ స్తుతించారు బ్రహ్మాది దేవతలు.
స్తుతించి, ధ్యానించి, ఆవాహన, ఆసన, పాద్య, అర్ఘ్య, ఆచమనీయ, స్నాన, పీతాంబర, ఉపవీత, గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్య, తాంబూల, నీరాజన, మంత్రపుష్ప, ప్రదక్షిణ, అపరాధ క్షమాపణలతో పూజించారు. సాష్టాంగ నమస్కారం చేసి బద్ధాంజలులై దేవికెదుట నిలబడ్డారు. దేవతల పూజాక్రమానికి దేవి ఆనందించింది. స్తోత్రానికి సంతసించింది.
‘ఓ దేవతలారా! మీ స్తోత్రానికి ఆనందించాను. మీ శత్రువైన మహిషుడు మరణించాడు. మీరు నిష్కంటకంగా రాజ్యం పాలించుకొనుడు. ఇంకను నావలన కాదగిన వరములు కోరుకొనుడని పలికింది. దేవతలు ఆనందించారు. దేవితో పలకడం మొదలుపెట్టారు. ఓ జగదంబా! నీవు ప్రస్తుతం మాకు కలిగిన క్లేశాన్ని హరించావు. మాకు కళ్యాణం చేకూరింది. ఈ సమయంలో మాకు ప్రసన్నురాలవై అనుగ్రహించినట్లే సర్వకాలములయందును మా యందు కరుణ వహింతువు గాక. ఎప్పుడెప్పుడు ఇటువంటి దుష్టరాక్షసులు బయలుదేరి లోకకంటకులై చరిస్తూ ఉందురో ఆయాకాలాల్లో నీవు ఆయా రాక్షస సంహారాని కనువైన రూపాల్ని ధరించి ఆ రాక్షసుల రూపుమాపి మమ్ములనేగాక సమస్త లోకాలనూ రక్షింతువు గాక. మేము స్మరించినపుడెల్లా మాకు దర్శనమిచ్చి మాకు వలయు కార్యముల నెరవేర్చి మమ్మనుగ్రహింతువు గాక. ఈ నీ మహిషాసుర మర్దనీ స్వరూపాన్ని ధ్యానించిన వారికి స్మరించిన వారికి, యీ చరిత్ర వ్రాసిన వారికి, పఠించిన వారికి, విన్నవారికి నీ యనుగ్రహము సంపూర్ణముగా కలుగుగాక. నీ దుర్గా స్వరూపానికి ‘జై’ యని దేవతలు తమ మనోభీష్టాల్ని వెల్లడించారు.
శ్రీదేవి తథాస్తు యని పలికి అంతర్ధానమైంది. దేవతలామాతనే స్మరించుచూ ఆనంద బాష్పాలు రాల్చుచు కోమలానందాతిరేకముచే గగుర్పాటు చెంద యా జగజ్జనని రూపాన్నే తలంచుకొనుచు యధేచ్ఛగ తమతమ స్థానాలకు పోయి ఆనందిస్తూన్నారు.
ఓ వత్సలారా! యీ రీతిగ, మహిష మర్దిని చరిత్ర సంగ్రహముగ సమాప్తమైంది. యీ చరిత్ర పఠన శ్రవణాదులచే మానవుడు అంబకు భక్తుడై యామె యనుగ్రహాన్ని పొంది ఇహలోకంలో సమస్త సౌఖ్యాలు అనుభవించి అంత్యమున అంబలో ఐక్యం పొందుతాడు.