దసరా శరన్నవరాత్రుల్లో ఐదవ రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవి, శ్రీ మహాచండీదేవిగా దర్శనమిస్తారు.
దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీదేవి ఉద్భవించారు. ఆ చండీదేవిలో అనేకమంది దేవతలు కొలువై ఉన్నారు. ఆ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలనూ ప్రార్థించినట్లే. మహాచండీ అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సర్వసంపదలూ లభిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. కోరిన కోరికలు సత్వరమే నెరవేరుతాయి.
ఈ ఏడాది కూడా శరన్నవరాత్రుల్లో చండీదేవి అలంకరణ ప్రత్యేకం కానుంది. జగజ్జనని దుర్గామాత ఈరోజున, మెరుపు మెరిసినప్పుడు వచ్చే వెలుగు అంతటి తేజోమయమైన రూపంతో సింహవాహనంపై భీషణంగా కూర్చొని తన అష్టభుజముల యందు నానావిధ ఆయుధాలను ధరించి, రాక్షస సంహారం గావించి లోక కళ్యాణం జరిపించిన దివ్యమైన రూపంతో భక్తులకు దర్శనమిస్తారు. ఈ పంచమి రోజున ఇంద్రకీలాద్రిపై చండీపారాయణం, చండీయాగం చేస్తారు.