శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రులు కనులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాల్గో రోజైన ఆదివారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారులకు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. నవదుర్గా స్వరూపాల్లో భాగంగా భ్రమరాంబ అమ్మవారు కుష్మాండ దుర్గగా భక్తులను కటాక్షించారు. ఈ దేవి ఎనిమిదిచేతులతో దర్శనమిచ్చింది. కుడివైపు పద్మం, బాణం, ధనస్సు, కమండలం, ఎడమవైపు చక్రం, గద, జపమాల, అమృతకళశాన్ని దాల్చి భక్తులను ఆశీర్వదించారు.
ఈ అలంకారంలో అమ్మవారిని పూజించడంతో సర్వ రోగాలు తొలగి ఆరోగ్యం, ఆయువు, యశస్సు వృద్ధిచెందుతాయి. అనంతరం ఆదిదంపతులు కైలాసవాహనంపై విహరించారు. గ్రామోత్సవంలో ఆనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు అమ్మవారికి ఆస్థానసేవ నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఈవో పెద్దిరాజు ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.