హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో సంజౌలీ ప్రాంతంలోని వివాదాస్పద మసీదు మీద అక్రమంగా కట్టిన మూడు అంతస్తులను కూల్చివేయాలని సిమ్లా జిల్లా కోర్టు ఆదేశించింది. ఆ కూల్చివేతకు అయ్యే ఖర్చులను మసీదు కమిటీ, వక్ఫ్ బోర్డు భరించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. కొన్నివారాలుగా స్థానికుల నిరసనలు, ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన అక్రమ కట్టడాలను కూల్చేయాలని ఆదేశించడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు.
మసీదు నిర్మాణమే మొదటినుంచీ వివాదంలో ఉన్నప్పటికీ, కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ పట్టించుకోకుండా దానిమీద అంతస్తులు కట్టేశారు. ఇప్పుడా అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి మసీదు కమిటీకి, వక్ఫ్ బోర్డుకు సిమ్లా కోర్టు రెండు నెలల వ్యవధి ఇచ్చింది. వక్ఫ్ బోర్డు తరఫున కేసు వాదించిన న్యాయవాది బిఎస్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ ‘‘మసీదు పైభాగంలోని మూడు అంతస్తులనూ తమ సొంత ఖర్చులతో కూల్చివేయాలని మసీదు కమిటీని, వక్ఫ్ బోర్డును ఆదేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానికి రెండు నెలల గడువు విధించింది. మసీదు నిర్మాణం మీద తీర్పు ఇంకా పెండింగ్లో ఉంది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 21న జరుగుతుంది’’ అని చెప్పారు. న్యాయస్థానం ఆదేశాలను పాటించి అనధికారిక నిర్మాణాలను గడువు లోపల కూల్చివేస్తామని మసీదు కమిటీ కోర్టుకు విన్నవించుకుంది.
మసీదు అక్రమంగా అంతస్తులు నిర్మించడంతో సంజౌలీ ప్రాంతంలో గత నెలరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సెప్టెంబర్ 11న స్థానిక హిందూ సంస్థలు బంద్ నిర్వహించాయి. అసలు మసీదు నిర్మాణమే అక్రమమైతే దానిమీద అంతస్తులు ఎలా నిర్మిస్తారంటూ ఆందోళన వ్యక్తం చేసారు. వారిని అణచివేయడానికి భద్రతా బలగాలు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.