డ్రగ్స్ స్మగ్లర్ల ఆట కట్టించేందుకు పోలీసులు చేస్తోన్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నారనే పక్కా సమాచారంతో గుజరాత్‌కు చెందిన ఏటీఎస్, ఢిల్లీకి చెందిన అధికారులు దాడులు చేశారు. దాదాపు రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మరికొంత ముడిపడార్థాలను కూడా సీజ్ చేశారు. ముందుగా అందిన పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేసినట్లు ఎంపీ హోం శాఖ సహాయ మంత్రి హర్ష సంఘవి ఎక్స్ వేదికగా తెలిపారు.
డ్రగ్స్ రహిత సమాజం కోసం పోలీసులు చాలా కష్టపడుతున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో ఢిల్లీలోనూ రూ.3 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో కొందరు కాంగ్రెస్ నేతలు జట్టు కట్టారంటూ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి సమయంలో మధ్యప్రదేశ్‌లో భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది.