***************************************************
(శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక)
రచన : కీ.శే పురాణపండ రామమూర్తి
***************************************************
వత్సలారా! పూర్వకాలంలో ఒకప్పుడు దేవతలకు, రాక్షసులకు యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో నూరు యుద్ధాలు పూర్తిగా గతించాయి. దేవతలకు ఇంద్రుడు నాయకుడుగా ఉన్నాడు. రాక్షసులకు మహిషాసురుడు నాయకుడుగా ఉన్నాడు. తుదకు ఆ యుద్ధంలో రాక్షసులు జయించారు, దేవతలు ఓడిపోయారు. మహిషాసురుడు స్వర్గాధిపత్యం వహించాడు. శాసనాలన్నీ మార్పు చేసాడు. సూర్య చంద్ర వరుణ వాయు కుబేరాదులందరినీ వశపరచుకున్నాడు. ఎవరికీ ఏవిధమైన అధికారాలూ లేవు. సర్వానికీ మహిషాసురుడే అధికారం వహించాడు. రాక్షసుల దుశ్శాసనాలకు లోనై దేవతలు, మహర్షులు, సత్పురుషులు కూడ చాల హింసింపబడుతున్నారు. ఆ బాధలను సహింపలేక ఇంద్రాది దేవతలు బ్రహ్మను ప్రార్థించి ప్రసన్నుని గావించుకొని బ్రహ్మను ముందుంచుకొని సమస్త దేవతలు కలిసి హరిహర స్థానాన్ని చేరారు. బ్రహ్మాది దేవతలంతా కలసి శివకేశవులను స్తుతి చేయడం ప్రారంభించారు. బ్రహ్మాదుల స్తోత్రానికి శివకేశవులు ప్రసన్నులైనారు.
బ్రహ్మ వారితో పలుకనారంభించాడు, ‘‘ఓ హరిహరులారా! మహాబలుడగు మహిషునిచే పరాజితులై ఇంద్రాది దేవతలందరు చాల హింస పొందుచున్నారు. యజ్ఞయాగాదుల్లో భాగాలన్నీ తానే గ్రహిస్తూన్నాడు మహిషుడు. దేవతలకెట్టి భాగాలూ లేవు. ఇంద్రాదులంతా సామాన్య మానవుల వలె భూలోకం చేరి అరణ్యాల్లో చరిస్తున్నారు. కరుణామూర్తులగు మీరుపేక్షించిన ఇంకను ప్రమాదాలు కలుగుతాయి. గాన మా ప్రార్థన నంగీకరించి, దుష్టుల ఖండించి శిష్టుల రక్షించి అధర్మాన్ని రూపుమాపి ధర్మాన్ని స్థాపింపుడ’’ని ప్రార్థించెను.
బ్రహ్మ పలుకులు వినిన తోడనే హరిహరుల కపారమగు క్రోధము జనించి తీక్ష్ణమగు దృష్టి ప్రసరించెను. శ్రీహరి యొక్క క్రోధదృష్టిలోనుండి దివ్యమైన తేజమొకటి బయలువెడలెను. అట్లే బ్రహ్మ, శివుడు, ఇంద్రాది దేవతల లోనుండి భిన్నభిన్న తేజస్సులు బయలుదేరి తుదకా తేజస్సంతయును ఏకమై మహాతేజముగ మారెను. కోటిసూర్యులతో సమానమైన ఆ మహాతేజస్సు చూచుచుండగనే ఒక స్త్రీరూపముగ మార్పుజెందెను. ఆ రూపము తయారుకావడంలో శ్రీసదాశివ తేజస్సు ముఖముగా మారింది. యముని తేజస్సు రోమములు, శ్రీమహావిష్ణువు యొక్క తేజస్సు భుజములుగ, చంద్రుని తేజము నాలుక, ఇంద్రతేజస్సు నడుముగ, వరుణతేజస్సు జంఘోరువులుగ, భూమియొక్క తేజము పిరుదులుగను, బ్రహ్మతేజముచే పాదములు, సూర్యతేజముచే పాదముల వ్రేళ్ళును, వసువుల తేజముచే చేతుల వ్రేళ్ళును, కుబేర తేజముచే నాసిక, ప్రజాపతుల తేజముచే దంతములు, అగ్నితేజమున త్రినేత్రాలు, సంధ్య తేజస్సుచే భ్రూద్వయము, వాయుతేజమున కర్ణములు ఉద్భవించెను. అనగా బ్రహ్మాది త్రింశత్కోటి దేవతల యొక్క తేజస్సు ఏకమై యొక స్త్రీశక్తి రూపమునొందెనని యర్ధము. అట్టి తేజోమూర్తియగు మహాశక్తిని జూచి మహిషాసుర భయకంపితులైన దేవతలందరూ ఆనందించిరి.
అనంతరం శివుడు తన శూలంలోనుంచి మరొక శూలాన్ని సృజించి దేవికిచ్చాడు. అట్లే విష్ణువు చక్రాన్ని, వరుణుడు శంఖాన్ని, అగ్నిహోత్రుడు శక్తిని, వాయువు ధనుర్బాణాలను, ఇంద్రుడు వజ్రమును, ఐరావతం ధరించే ఘంటను కూడ దేవికిచ్చెను. యముడు కాలదండాన్ని, వరుణుడు పాశాన్ని, ప్రజాపతి స్ఫటికమాలను, బ్రహ్మ కమండలాన్ని దేవికి సమర్పించారు. సూర్యుడు తన కిరణములను దేవి రోమకూపాల ద్వారా ప్రకాశింపజేసాడు. కాలుడు కన్నులు మిరుమిట్లు గొలిపే డాలు, ఖడ్గం సమర్పించాడు. సముద్రుడు దివ్యమైన హారము, ఎన్నడును జీర్ణించని వస్త్రాలు సమర్పించాడు. ఇంకను సమస్త అవయవముల యందును ధరించుటకు యోగ్యములగు అమూల్యాభరణాలను సమర్పించాడు. విశ్వకర్మ అతినిర్మలమైన ‘పరశువు’ అనే ఆయుధాన్ని ఇచ్చాడు. ఇంకను అనేకమైన అభేద్యములయిన కవచ ఖడ్గాదుల నిచ్చారు. ఎన్నడును జూడనివియు, వాసన చెడనివియు నగు పంకజములతో నిర్మించిన మాలికను గూడ ఇచ్చారు. కుబేరుడు మధువుతో నిండిన మధుపాత్ర నిచ్చాడు. ఆదిశేషుడు అమూల్యమైన నాగహారాన్నిచ్చాడు. హిమవంతుడు సింహాన్ని వాహనంగా సమర్పించాడు.
ఈరీతిగ సమస్త దేవతలు తమతమ శక్తికొలది దేవినారాధించి సమస్త సాధనములు సమర్పించారు. తోడనే యా మహామాయాశక్తి కవచమును ధరించి సమస్తాయుధాలను గ్రహించి సింహవాహనాన్ని అధిరోహించి శంఖం పూరించి సింహనాదం చేసింది దేవి. ‘శ్రీదేవికి జై! శ్రీదేవికి జై! శ్రీదేవికి జై!’ యను నినాదాలు చేసారు దేవతలు. దేవతల యొక్క జయజయధ్వనులతో, సింహనాదంతో దిగంతములు వ్యాపించే శబ్దం బయలుదేరింది. బ్రహ్మాండము పగులునేమోయను శంక కవకాశం కలుగుతోంది. భూమి చలిస్తోంది. సముద్రాలు కంపిస్తున్నాయి. కులపర్వతాలు కదలిపోతున్నాయి. తారాగణం అల్లల్లాడుతోంది. ఇట్లు సమస్తలోకభయంకరమైన సింహనాదాలతో బయలుదేరింది మహాశక్తి.
భూతభయంకరమైన సింహగర్జన విన్నాడు మహిషాసురుడు. సర్వసైన్యాధిపతిని పిలిచాడు. యుద్ధ సన్నాహానికి ఆజ్ఞ ఇచ్చాడు. మహిషుని సర్వసైన్యాధిపతి ‘చిక్షురుడు’. అతడు యుద్ధప్రియుడు. సర్వసైన్యాన్నీ ఆయత్తం చేసాడు. యుద్ధానికి వచ్చేవారెవరో గ్రహించాడు. సర్వసైన్యాలు ‘అంబిక’ను చుట్టుముట్టడించాయి. మహిషాసురుడు ముందుకొచ్చాడు. దేవిని చూచాడు. ఆ అపూర్వమైన తేజస్సుకు అచ్చెరువొందాడు. ఆ రూపం చూచి స్తబ్ధుడైపోయాడు. అది సమస్తజగదాధారమూర్తియగు చిచ్ఛక్తియని గ్రహించాడు. తనకు కాలమాసన్నమైందని సిద్ధాంతం చేసుకున్నాడు. దేవి ధనుష్ఠంకారం చేస్తే క్రింది ఏడులోకాలూ క్షుబ్ధమైపోతున్నాయి. శంఖం పూరిస్తే పై ఏడులోకాలూ కంపిస్తున్నాయి. తన తేజము ముల్లోకాలకూ కాంతినిస్తోంది. ఇదంతా గ్రహించాడు మహిషుడు. లోకం మహిషుణ్ణెలా అర్ధం చేసుకున్నా అతడు మహావీరుడు, మహామేధావి అని మాత్రం గ్రహించాలి. మరణం తప్పదనుకున్నాడు. యుద్ధానికి అనుజ్ఞనిచ్చాడు.
చిక్షురుడు అపారమగు అసుర సైన్యాలతో దేవిని ఎదిరించాడు. మహావీరుడగు చామరుడు కూడ మహాసైన్యాలతో యుద్ధంలోకి దిగాడు. ఉదగ్రుడను మహారాక్షసుడు ఏడువేల మహారధికుల తోడను, మహాహను అనేవాడు కోటి రధికుల తోడను, అసిలోముడు (కత్తుల వంటి రోమములు కలవాడు) ఐదుకోట్ల మహారధికుల తోడను, బాష్కలుడు అనేవాడు ఏడులక్షల సైన్యాల తోడను పరివారితుడనువాడు ఒకకోటి మహారధికులు, అసంఖ్యాకములైన గజాశ్వదళాలతోను యుద్ధంలో ప్రవేశించారు. బిడాలుడు కూడ నిట్లే అసంఖ్యాకులగు రథ గజ తురగ పదాతి సైనికులతో యుద్ధంలో ప్రవేశించాడు. స్వయంగా మహిషాసురుడిట్లు అసంఖ్యాకములైన చతుర్విధ సైన్యాలు చుట్టును నిలువ దేవితో యుద్ధాన్ని ప్రారంభించాడు. అంబికతో రాక్షసులకు సంగ్రామం ప్రారంభమైంది. ఘోరాకారులు మహావీరులునగు రాక్షసులు శక్తి తోమర భిండివాల పరశు పట్టిస ఖడ్గ శూల గదాద్యాయుధాలతో దేవితో యుద్ధం ప్రారంభించారు.
మహాశక్తి శివా స్వరూపాన్ని ఉపసంహరించింది. ఘోరాకారాన్ని ధరించి అనంతమైన బాహువులు కలదై అందరకన్నిరూపులై యుద్ధం ప్రారంభించింది. క్రోధాగ్నిని విరజిమ్మే ఆమె దృష్టిప్రసారమాత్రంచే మరణిస్తున్నారు కొందరు రాక్షసులు. ఆ ఘోరరూపాన్ని చూచినమాత్రంచేతనే కొందరు యమపురాన్ని చేరుతున్నారు. గదాఘాతములచే కొందరు, బాణవృష్టికి కొందరు, ఖడ్గధారలకు గురియై మఱికొందరు మరణిస్తున్నారు. ఇట్లే శూలాద్యాయుధాలచే రాక్షస సైన్యాలను చీల్చిచెండాడుతోంది మహాశక్తి. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసములలోనుండి రాక్షస సంహార కారకములైన అనంతములగు శక్తిగణాలు జనించాయి. ఆ శక్తిగణాలన్నీ అసంఖ్యాక రాక్షస సైన్యాలను రూపుమాపుతున్నాయి. ఒక చెయ్యి నరికితే ఒక చేతితో యుద్ధం చేస్తున్నారు రాక్షసులు. రెండుముక్కలక్రింద నరికితే పైఒక్కముక్కే యుద్ధం చేస్తోంది. శిరస్సు నరికితే శిరస్సు ఏనుగనెక్కి యుద్ధానికొస్తోంది, మొండెం యుద్ధభూమిలో నృత్యం చేస్తోంది.
ఈరీతిగ నొకచో రాక్షసమాయ తన ప్రభావం చూపుతుంటే రెండవవైపు మహామాయ అట్టి రాక్షసమాయ నతిక్రమించి తన శక్తిని విజృంభింపజేస్తోంది. ఆ యుద్ధభూమిలో శక్తిగణాలు అసంఖ్యాకులగు రాక్షసులను సంహరిస్తున్నాయి. శక్తివాహనమగు సింహం కూడా అనేక గజయూధాలను మృత్యుదేవత కాహారంగా చేస్తోంది. ఈరీతిగ ఘోరసంగ్రామం జరుగుతూంటే ఆ యుద్ధభూమిలో భూత ప్రేత శాకినీ డాకినీ బేతాళాది గణాలు వికటనృత్యం చేస్తున్నాయి. రక్తం ఏరుల క్రింద పారుతోంది. కళేబరాలు పర్వతరాశులుగ గోచరిస్తున్నాయి. రాక్షససైన్యాలు నాలుగింట మూడుపాళ్ళు నశించాయి. దేవతలానందిస్తూన్నారు. రాక్షసులు సంపూర్ణంగా జీవితాశ వదులుకున్నారు. ఈరీతిగ దేవియొక్క మహాశక్తి విజృంభించి దుష్టసంహారం చేస్తోంది. సైనికులంతా నిహతులైనారు. దానితో నాటి యుద్ధము ముగిసియున్నది.