ఉగ్రవాదులను ఏరి వేసేందుకు ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. తాజాగా
మధ్య గాజా ప్రాంతంలోని ఓ మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 24 మంది చనిపోయారని పాలస్తీనా వైద్యులు ప్రకటించారు. శరణార్థుల ముసుగులో ఉగ్రవాదులు తిష్ట వేశారనే సమాచారంతో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసినట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్‌పై గత ఏడాది అక్టోబరు 7న హమాస్ తీవ్రవాదులు విరుచుకుపడి 1400 మందిని పొట్టన బెట్టుకున్న తరవాత మొదలైన యుద్దం నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. ఏడాది కాలంగా హమాస్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 42 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్ష మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది.
హమాస్, హెజ్బొల్లా అగ్రనేతలను ఇజ్రాయెల్ సైన్యం చంపివేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా నేరుగా యుద్దంలోకి దిగింది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్‌పై 200 క్షిపణులతో దాడులు చేసింది.
ఇరాన్‌పై ప్రతిదాడులు చేసేందుకు ఇజ్రాయెల్ సిద్దమవుతోందని తెలుస్తోంది. ప్రధాని బెంజిమన్ నెతన్యాహు నుంచి ఆదేశాలు రాగానే ఐడీఎఫ్ ఇరాన్‌పై విరుచుకుపడే అవకాశం లేకపోలేదు. మరో వైపు ప్రాన్స్, ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరా నిలిపివేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.