శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి సంబంధించి కేరళ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో కార్తీకమాసం ప్రారంభం కానుండటంతో అయ్యప్ప దీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో, కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే వీలుంటుందని స్పష్టం చేసింది. సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో శబరిమలకు సంబంధించిన పలు నిర్ణయాలు తీసుకున్నారు.
మకరవిళక్కు సీజన్ మరో నెలలో ప్రారంభం కానుంది. అయ్యప్ప భక్తులు ఈ కాలాన్ని పరమపవిత్రంగా బావిస్తారు. మణికంఠస్వామి దర్శనానికి రోజుకు 80 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది. వర్చువల్ క్యూ బుకింగ్ విధానంలో భాగంగా భక్తులు తాము వచ్చే మార్గాన్ని కూడా ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. అటవీమార్గంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది.