దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోరం చోటు చేసుకుంది. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. చెంబూర్ ప్రాంతంలోని ఓ భవనంలో కింద అంతస్తులో వ్యాపారం నిర్వహిస్తూ పై అంతస్తులో వ్యాపారి కుటుంబం నివాసం ఉంటోంది. అర్థరాత్రి విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. తప్పించుకునే మార్గం లేకపోవడంతో కుటుంబంలోని అందరూ చనిపోయారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి బాధితులను సమీపంలోని రాజావాడి ఆసుపత్రికి తరలించే లోపే బాధితులు చనిపోయారని పోలీసులు తెలిపారు.
మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మంటలు చెలరేగడంతో పొరుగింటివారు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలార్పినట్లు ముంబై పోలీసులు తెలిపారు.