దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు దారితీసిన పశ్చిమ బెంగాల్ ఆర్జి కర్ ఆసుపత్రి ఘటనలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించడంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ విఫలమయ్యారంటూ జూనియర్ డాక్టర్లు శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఆగష్టు 9న ఆర్జి కర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచారం తరవాత తీవ్ర నిరసనలు కొనసాగాయి. 41 రోజుల నిరసనలు తరవాత సీఎం మమతా బెనర్జీ ఇచ్చిన హామీ మేరకు జూనియర్ డాక్టర్లు విధుల్లో చేరిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి నేటి వరకు ప్రభుత్వం తమ రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు.
వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి నిగమ్‌ను విధుల నుంచి తప్పించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రుల్లో పోలీసు బలగాలను పెంచాలని, మహిళా కానిస్టేబుళ్లను నియమించాలని జూనియర్ డాక్టర్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష విరమించేది లేదని వారు హెచ్చరించారు.
ప్రస్తుతం ఆరుగురు జూనియర్ డాక్టర్లు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. సీసీటీవీ కెమెరా పర్యవేక్షణలో నిరాహార దీక్ష చేస్తున్నారు. మిగిలిన డాక్టర్లు విధుల్లో పొల్గొంటూ, నిరాహార దీక్ష కొనసాగిస్తారని జూనియర్ డాక్టర్ల సంఘం తెలిపింది.