కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్షనేత అయిన రాహుల్ గాంధీకి పుణే మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. దివంగత వినాయక దామోదర్ సావర్కర్ మనవడు సాత్యకి సావర్కర్ దాఖలు చేసిన నేరపూరిత పరువునష్టం దావాలో కోర్టు విచారణకు అక్టోబర్ 23న హాజరు కావాలని ఆదేశించింది.
వినాయక దామోదర్ సావర్కర్ సోదరుల్లో ఒకరి మనవడైన సాత్యకి సావర్కర్ 2023 ఏప్రిల్‌లో రాహుల్ గాంధీ మీద కేసు పెట్టారు. ఆయన న్యాయవాది సంగ్రామ్ కొల్హాత్కర్ ఆ కేసు వివరాలు తెలియజేసారు. రాహుల్ గాంధీ గతేడాది యునైటెడ్ కింగ్డమ్లో పర్యటించినప్పుడు సావర్కర్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు. 2023 మార్చి 5న లండన్ నగరంలో ఒక సమావేశంలో పాల్గొన్నప్పుడు రాహుల్ గాంధీ వినాయక దామోదర్ సావర్కర్ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలాంటి వ్యాఖ్యలు చేసారు.
సావర్కర్ గురించి రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేసి ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించారని, తద్వారా ఆయన కుటుంబానికి మానసిక అశాంతి కలిగించారనీ ఫిర్యాదిదారు ఆరోపించారు. ఆ కేసును క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 202 ప్రకారం విచారించాలంటూ కోర్టు పుణే పోలీసులను ఈ యేడాది మొదట్లో ఆదేశించింది.
తాజాగా, అక్టోబర్ 3 గురువారం నాడు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేష్ గుండూరావు వీర సావర్కర్ మీద చేసిన తప్పుడు వ్యాఖ్యలపై సావర్కర్ కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ నాయకులు సైతం విరుచుకుపడ్డారు. సావర్కర్ చిత్పవన బ్రాహ్మణుడు అయినప్పటికీ గోమాంసం భుజించాడంటూ దినేష్ గుండూరావు వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది.
సావర్కర్ మనవడైన రంజిత్ సావర్కర్, దినేష్ గుండూరావు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. వీర సావర్కర్ గోమాంసం తిన్నారనడం పచ్చి అబద్ధమన్నారు. ఆ వ్యాఖ్యలు చేసిన దినేష్ గుండూరావు మీద పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. ‘‘సావర్కర్‌ను అవమానించడం అనే వ్యూహాన్ని కాంగ్రెస్ ఎన్నోయేళ్ళనుంచి కొనసాగిస్తూ వస్తోంది. రాహుల్ గాంధీ అదే పనిచేసారు. ఇప్పుడు ఆయన పార్టీ నాయకులు అలాంటి ప్రకటనలే చేస్తున్నారు. ఇదీ కాంగ్రెస్ నిజమైన ముఖం. హిందువులను కులాల వారీగా విభజించి ఎన్నికల్లో గెలవాలన్నది వారి కుట్ర. సావర్కర్ గోమాంసం తిన్నారనీ, గోవధను సమర్ధించారనీ చెప్పడం పూర్తిగా తప్పు. ఆయన మరాఠీలో రాసిన వ్యాసాన్ని వక్రీకరించి అలాంటి వ్యాఖ్యలు చేసారు. ఆవులు చాలా ఉపయోగకరమైనవనీ, అందుకే వాటిని దేవతలుగా పూజిస్తారనీ సావర్కర్ రాసారు. అంతేకాదు. ఆయన అప్పట్లో గోరక్షా సమ్మేళన్ సంస్థకు అధ్యక్షుడిగా కూడా పనిచేసారు. అలాంటి వ్యక్తి మీద అబద్ధపు ఆరోపణలు చేసిన దినేష్ మీద పరువునష్టం దావా వేస్తాను’’ అని రంజిత్ చెప్పారు.