శరన్నవరాత్రి మహోత్సవములలో నాలుగవ రోజైన నిజ ఆశ్వయుజ శుద్ధ చతుర్థి ఆదివారం అంటే ఇవాళ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గాదేవి, శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు.
శ్రీచక్ర అధిష్ఠాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాది దేవతగా తనను కొలిచే భక్తులను, ఉపాసకులను కరుణిస్తారు. కుడివైపు లక్ష్మీదేవి, ఎడమవైపు సరస్వతీ దేవి విరాజిల్లుతుండగా చెఱకుగడ, విల్లు పాశాంకుశములను ధరించి ఎరుపు, నీలం రంగు చీరెల్లో లలితాదేవి దర్శన సౌభాగ్యం కలుగుతుంది.
కనకదుర్గమ్మ మహాకామేశ్వరాంకయై లలితాదేవీ అవతారంలో దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు మహాకామేశ్వరుడుగా అమ్మవారు త్రిపురసుందరీదేవిగా పూజలందుకుంటారు.
ఈరోజు అమ్మవారికి పాయసాన్నం, చక్రాన్నం, పూర్ణాలు, అల్లం గారెలు… ఇలా పదిరకాల నైవేద్యాలను సమర్పిస్తారు.