తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండోరోజున( శనివారం) రాత్రి శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై నుంచి భక్తులను ఆశీర్వదించారు . వీణ ధరించి సరస్వతి దేవి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక.అలాగే పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ హంసకు ఉంటుంది. ఆత్మానాత్మ వివేకానికి హంససూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా సంబోధిస్తారు . భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని స్వామి అధిరోహిస్తాడని పురాణాల్లో పేర్కొన్నారు.
హంస వాహన సేవ సందర్భంగా టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఐదు రాష్ట్రాలకు చెందిన 511 మంది కళాకారులు 18 కళాబృందాలుగా ఏర్పడి ప్రదర్శనలిచ్చారు.
తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులు భరతనాట్యం చేయగా, మహారాష్ట్రకు చెందిన గీతా బృందం కథక్ నృత్యంతో అలరించారు. కర్నాటకకు చెందిన డాక్టర్ రక్షాకార్తిక్ దీప నృత్యం అహా అనిపించింది.