తిరుపతికి వెళ్ళే ముందు భక్తులు ఇక్కడ పూజలు చేసేవారని వెల్లడి
దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి గౌరవార్థం కడప జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా అప్పటి గత ప్రభుత్వం మార్చింది. ప్రస్తుతం ఆ పేరును మార్చాలనే డిమాండ్ వినపడుతోంది. వైఎస్సార్ జిల్లా పేరును ‘వైఎస్సార్ కడప’గా మార్చాలని బీజేపీ అగ్రనేత, మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ రాశారు.
కడప పురాణ ప్రాశస్త్యం ఉన్న ప్రాంతమని లేఖలో పేర్కొన్న మంత్రి సత్యకుమార్, దేవుని కడప సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమన్నారు. స్వామివారు శ్రీలక్ష్మీ అమ్మవారి సమేతంగా అవతరించిన ప్రాంతమని లేఖలో గుర్తు చేశారు.
తిరుమల వెళ్లే ముందు భక్తులు దేవుని కడప ఆలయంలోని శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయతీగా ఉండేదని, గత ప్రభుత్వం అవగాహన లేకుండా ‘వైఎస్సార్ జిల్లా’ గా పేరు మార్చిందని లేఖలో తెలిపారు. ఈ పరిణామంతో వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నప్పటికీ, భయం కారణంగా ఎవరూ మాట్లాడలేకపోయారని తెలిపారు.
కడప జిల్లా అభివృద్ధికి వైఎస్సార్ కృషి చేసినప్పటికీ చారిత్రక నేపథ్యం దృష్ట్యా ఈ జిల్లాకు ‘వైఎస్సార్ కడప జిల్లా’ అని పేరు మార్చాలని కోరారు.