బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) అంచనా వేసింది. నైరుతి బంగ్లాదేశ్ ప్రాంత పరిధిలో ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌కు చేరువగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్‌పై కూడా దీని ప్రభావం ఉండనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో రానున్న నాలుగు రోజులు పాటు ఏపీతో పాటు తెలంగాణలో వానలు పడనున్నాయి.
రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, నంద్యాల, అనంతపురం, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.
తెలంగాణలో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముంది.