శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీవారి దర్శనానికి వీఐపీలు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదని అధికారులకు సూచించారు. ప్రసాదాల్లో నాణ్యత పెరగాలని తిరుమలలో ప్రశాంతతకు భంగం కలగకూడదని వివరించారు. కొండపై గోవింద నామస్మరణం తప్ప మరేమీ వినిపించకూడదని స్పష్టం చేశారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సంతృప్తిగా తిరుగు ప్రయాణం అయ్యాలే అధికారులు వ్యవహరించాలన్నారు.
తిరుమల పవిత్రతను, నమ్మకాన్ని కాపాడేలా టీటీడీ అధికారులు, సిబ్బంది పని చేయాలని సూచించారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో అధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో, శుక్రవారం సీఎం చంద్రబాబు తిరుమల చేరుకున్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ అధికారులు సీఎంకు స్వాగతం పలికారు.
సీఎం చంద్రబాబు సతీసమేతంగా వేంకటేశ్వరస్వామికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. పెద్ద శేష వాహన సేవలోనూ పాల్గొని శ్రీవారిని సేవించారు.
పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు,
కలియుగ దైవం ఈ సమాజాన్ని అన్ని విధాలా ఆదుకునే శ్రీ వెంకటేశ్వరస్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్కువ సార్లు పట్టు వస్త్రాలు, ఇతర లాంఛనాలు సమర్పించే అదృష్టం తనకు లభించిందని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.
బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల్లో 15 లక్షల మంది భక్తులు తిరుమల వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకోవాలని సూచించింది.