శరన్నవరాత్రి మహోత్సవములలో మూడవరోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారములో దర్శనమిస్తారు. శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వజీవనాధారం. అన్నం లేనిదే జీవులకు మనుగడ లేదు.
శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమచేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నము, వజ్రాలు పొదిగిన గరిటెతో సాక్షాత్తుగా ఈశ్వరునికే భిక్షను అందించే అంశము అద్భుతము. ఆమె దర్శనము సర్వపుణ్య ప్రదాయకము. లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మిన్న ఏదీ లేదు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో శ్రీ దుర్గమ్మను దర్శించి తరించడం వలన అన్నాదులకు లోపం లేకుండా ఇతరులకు అన్నదానం చేసే సౌభాగ్యాన్ని భక్తాదులు పొందగలుగుతారు.
శ్రీ అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్ సిద్ధి, శుద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్టి పోషకురాలు ‘అమ్మ’ అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుద్ధి జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది.