***************************************************
(శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక)
రచన : కీ.శే పురాణపండ రామమూర్తి
***************************************************
‘‘సత్పురుషులారా! కష్టకాలములో మీకు దేవిని గూర్చి తెలిసికొన నుత్సుకత కలిగెను. గాన మీకు రాబోవు కాలము మిగుల కళ్యాణప్రదమనక తప్పదు. సావధానులై యాలింపుడు. చిచ్ఛక్తి యగు మహామాయ చరిత్రను వెల్లడింప సహస్రవదనునకు గాని నాదిశేషువునకు గాని షణ్ముఖుడగు కుమారునకు గాని పంచవదనుడగు శివునకు గాని చతుర్ముఖునకు గాని శక్యము కాదు. అట్టితరి సామాన్యుడనగు నేనెట్లు చెప్పగలను? ఐనను మహామాత కరుణచే నా యోపిన కొలది సంగ్రహముగ నుడివెదను.
ఆ చిచ్ఛక్తి సత్యస్వరూపురాలు. సర్వవ్యాపకమైనది. జనన మరణాది లక్షణము లేనిదై యుండియును దేవతల యొక్క కార్యములను సాధించుట, దుర్మార్గమును నశింపజేసి సన్మార్గమును స్థాపించి లీలాభూయిష్టములైన తన జన్మకర్మాదుల చరిత్రచే సమస్త లోకాలికి కళ్యాణాన్ని చేకూర్చేటందులకుగాను అనగా తన చరిత్ర పఠన శ్రవణాదుల చేతను తన రూపధ్యానోపాసనారాధనల చేతను బ్రహ్మాది దేవతలనే గాక సామాన్య మానవులను గూడ తరింపజేయాలని ఆమె యనేక రూపాలు ధరించింది. అనేక లీలలు చూపించింది. శ్రీదేవి యొక్క అనంతరూపాలను కొంతవరకూ వర్ణిస్తానన్నాడు మహర్షి.
మహారాజా! అనంతము అనాదియగు సృష్టిచక్రం తిరుగుతూంది. మహాప్రళయాలు, అవాంతర ప్రళయాలు, దైనందిన ప్రళయాలు జరుగుతున్నాయి. అనేకులు సృష్టికర్తలు జనిస్తూన్నారు నశిస్తూన్నారు. అట్టి అనంతమైన కాలగర్భంలో ఒకప్పుడు కల్పాంతమై సమస్త చరాచర ప్రపంచము లీనమైపోయింది. జగత్తంతయు జలార్ణవమైపోయింది. ఆ జలార్ణవం మీద వేయిపడగల శేషపాన్పుపై పవళించాడు విష్ణుదేవుడు. మహామాయ నిద్రారూపిణిగ నారాయణుని నేత్రాలను ఆశ్రయించింది. అతడు యోగనిద్రాపరవశుడై యున్నాడు. తిరిగి సృష్టికాలం సమీపించింది. శ్రీహరి నాభీకమలములో నుంచి సృష్టికర్త ఉదయించాడు. ఎందుకు జన్మించామో? ఏం చేయాలో? అర్ధం కావడం లేదు. ధ్యానిస్తున్నాడు బ్రహ్మ. కాలం గతిస్తూంది. శ్రీహరి శ్రవణేంద్రియములలోనుంచి కర్ణమలం బయలుదేరింది. దాన్నుండి ఘోరాకారులైన పురుషులిరువురు జన్మించారు. అనంతార్ణవంలో అనంతుని దేహములోనుండి జనించిన ఆ ఘోరాకారులు కూడ అనంతులుగానే ఉన్నారు. వారే మధుకైటభాసురులు. జగమేకార్ణవమై యుండుట బ్రహ్మకు వాసస్థానమైన పద్మము వాసయోగ్యంగా ఉండుట కారణాలుగ ఆ పద్మాన్ని తామాశ్రయించాలని ప్రయత్నించారు. మధుకైటభులు బ్రహ్మతో యుద్ధం చేయాలని సంకల్పించారు. బ్రహ్మపై యుద్ధం ప్రకటించారు. బ్రహ్మ వారిని చూచి భయకంపితుడైనాడు. ఏం చేయాలో అర్ధం కాలేదు. బాగా ఆలోచించాడు. శ్రీహరి యోగనిద్రలో ఉన్నాడు. శ్రీహరి మేల్కాంచిన గాని దైత్యులను నిగ్రహించడం కష్టమనుకున్నాడు. శ్రీహరి నేత్రాలను అధిష్టించియున్న యోగమాయాశక్తి నుపాసించాలని గ్రహించాడు. నిద్రాస్వరూపిణియగు చిచ్ఛక్తిని స్తుతించడం మొదలుపెట్టాడు.
‘‘ఓ మహాదేవీ! నీవే స్వాహా స్వధా వషట్కారములు, స్వరములు కూడ నీ స్వరూపాలే. నీవే జీవనదాయినివగు సుధాస్వరూపురాలవు. ప్రణవరూపమగు అకార మకార ఉకార స్వరూపిణివి. ఈ మాత్రాత్రయము కంటె మించిన నిత్య స్వరూపమగు ఏ బిందురూపమైతే కలదో? ఏ అర్ధమాత్ర అయితే కలదో? ఇంతకంటే వివరించే ఏ రూపాన్నైతే నిర్వచించడానికి శబ్దాలు లేవో అట్టి రూపము కూడ నీవే. నీవే సావిత్రి, సంధ్యారూపిణివి. పరం కంటె పరమైన జగన్మాతవు నీవే. సృష్టి స్థితి లయాలు నీ అధీనంలో ఉన్నాయి. రెప్పపాటులో అనేక బ్రహ్మాండాలు పుట్టిస్తావు. రెప్పపాటులో లయం చేస్తావు. సృష్టికాలంలో సృష్టిరూపంగా పాలనకాలంలో పాలనరూపంగా లయకాలంలో లయరూపిణిగా ఉంటావు. ఖడ్గ తోమర భిండివాల గదా పరశు ధనురాద్యాయుధాలన్నీ ధరిస్తావు. ఆ ఆయుధాలు కూడ నీ స్వరూపాలే. చరాచర ప్రపంచంలో నీకంటె భిన్నమైన వస్తువు లేదు. సమస్త జగదాధారమూర్తియగు మాధవునే ఆవరించి నిద్రాపరవశుని గావించిన నీ శక్తిరూపాదులను వర్ణింపనెవనితరము. ఓ మహామాయా! జగజ్జననీ! లోకమాతా! నన్ను రక్షింతువు గాక. ఓ రాజరాజేశ్వరీ! నీవే మహావిద్యా మహామాయా మహామేధా మహాస్మృతి మహామోహాది స్వరూపురాలవు. త్రిగుణములను సృజింప సమర్ధురాలవైన ప్రకృతివి నీవే. కాళరాత్రి, మోహరాత్రి, మహారాత్రి స్వరూపురాలవు. త్రిగుణాత్మకమైన నీవే సృష్టి స్థితి లయకారులుగ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృజించు సర్వాధార మూర్తివి నీవే! నీకంటె పరమైన వస్తువు లేదు. అఘటిత ఘటనా సామర్థ్యం గల నిన్ను ఉన్నదని గాని, లేనిదని గాని నిర్ణయింపలేకున్నాము. సదసద్వస్తురూపాలన్నీ నీవే. యీరీతిగ అనేక వేదోక్త పురాణోక్త మంత్రాలచే స్తుతించాడు బ్రహ్మ. ఇంకా ఇలా అన్నాడు. నీవు సర్వజ్ఞురాలవు. నీకు తెలియని అంశాలు ప్రపంచంలో ఉండవు. యీ ఏకార్ణవంలో శ్రీహరిని నిద్రబుచ్చి అతని నాభీకమలంలోనుంచి నన్ను సృజించావు. అంతతో నూరుకొనక విష్ణువు కర్ణమలంలోనుండి మధుకైటభాసురులను సృజించావు. వారు నా నివాసయోగ్యమైన పద్మాన్ని ఆక్రమించాలని నా మీద యుద్ధం ప్రకటించారు. చూస్తే వారు నాకంటె బలశాలురుగా నున్నారు. పైగా నాకు సృజనక్రమమేగాని ఇతర అంశాలతో సంబంధం లేదు. గాన నీవు అనుగ్రహించి శ్రీనారాయణుని మేల్కొలిపి శ్రీహరిలో మధుకైటభ వధోద్దేశ్యమును కలిగించి మధుకైటభ సంహారరూపంగా కళ్యాణాన్ని ప్రసాదింపుమని ప్రార్థించాడు చతుర్ముఖుడు.
దేవికి అనుగ్రహం కలిగింది. శ్రీహరి దేహంలోనుంచి మహామాయాశక్తి ఆవిర్భవించింది. బ్రహ్మకు అభిముఖురాలై నిలువబడింది. శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొన్నాడు. శేషశయ్యయందు ఆసీనుడై ఏకార్ణవమైన జలము నలువైపుల పరిశీలించి చూచేసరికి, వికృతాకారులైన మధుకైటభులు కనుపించారు. వారు చాలా బలిష్ఠులు, దృఢకాయులు. ఆ అసురులిరువురును బ్రహ్మను మ్రింగివేయుటకు గాను బ్రహ్మపై నురుకుచుండుటను గమనించాడు విష్ణువు. వెంటనే శేషశయ్య నుండి లంఘించాడు. మధుకైటభులతో యుద్ధం ప్రారంభించాడు. కాలం గతిస్తోంది. ఐదువేల సంవత్సరాలు నడిచాయి. వారికేమి శ్రమ కలగడం లేదు. పైగా నానాటికి వారు యుద్ధమునందు గల ఉత్సాహముచే ఉన్మత్తులైపోతున్నారు. శ్రీమహావిష్ణువును కూడ లెక్కచేయుటలేదు. చూచింది మహామాత. శిరీషపుష్పం కంటె కోమలమైన శరీరం గల మహావిష్ణువు వాని ముష్టిఘాతములచే నలిగిపోతున్నాడు. వెంటనే ఆ రాక్షసుల మీద మాయ దృష్టిని ప్రసరించింది. మధుకైటభులు మాయామోహితులైనారు. రానున్నది గ్రహింపలేకపోయారు. మాధవుణ్ణి పిలిచారు. ఓ శ్రీహరీ! నీ వీరత్వానికి మేము ఆనందించాము. నిన్ను చూస్తే మాకు చాలా సంతోషం కలుగుతూంది. నీవు జగజ్జెట్టివి, మహావీరుడవు గాన నీయెడల మాకు ప్రేమ జనించింది. నీకు కావలసిన వరం కోరితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఆ రాక్షసులు.
వారి మాటలకు ఆనందించాడు శ్రీహరి. ప్రసన్నవదనంతో వారివైపు చూచాడు. చిరునవ్వు నవ్వాడు. వారిని సంబోధించాడు. ఓ మధుకైటభులారా! భూతములన్నియును లయమై ఏకార్ణవరూపంగా ఉన్నకాలంలో బ్రహ్మతో సమానంగా ఉద్భవించారు మీరు. మహాబలశాలురు, తేజశ్శాలురు. మీరు ఆడినమాట తప్పనివారని తలచుచున్నాను. ఆచంద్రతారార్కంగా కీర్తిని గడించడం ప్రధానం. జనించిన జీవికి నేడో రేపో మరణం తప్పదు. గాన పలికిన పలుకు సత్యం చేసుకొని శాశ్వత కీర్తిని గడించండి. మీరు నే కోరిన వరమిస్తానన్నారు గనుక కోరుతున్నానన్నారు విష్ణువు. ముమ్మాటికీ సత్యమన్నారు రాక్షసులు. మీరిరువురు నా చేతుల్లో మరణించడమే నాకు కావలసిన వరమన్నాడు నారాయణుడు. నీరు లేని ప్రదేశంలో మమ్ము సంహరింపుమన్నారు అసురులు. సరేనన్నాడు. విశ్వరూపాన్ని ధరించి తన తొడలపైకి రమ్మని యా మధుకైటభులిద్దర్ని సంహరించాడు శ్రీహరి. మధుకైటభులు మహావీరులగుట, చావంటే భయం లేదు వారికి. పైగా వీరుడంటే ఎప్పుడూ నిజమైన వేదాంతిగా ఉంటాడు వాడే వీరుడు. తమ వీరత్వాన్ని సార్థకం చేసుకుని ఆదర్శ వీరులైనారు మధుకైటభాసురులు. వారి సంహారాన్ని చూచి ఆనందించాడు బ్రహ్మ. చిరునవ్వుతో శిరస్సు ఊపాడు శ్రీహరి. నాటినుండి శ్రీహరికి మధుకైటభారి యని బిరుదు వచ్చెను. యీ కృత్యములన్నియును మాయాశక్తివేయై యుండెను.