అమెరికాలోని హిందూ సంస్థలు భారీ ఎయిర్‌లైన్ బ్యానర్‌తో ప్రపంచానికి తమ విజ్ఞప్తిని బలంగా వినిపించారు. బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోతను ఆపడానికి ప్రపంచదేశాలు అత్యవసరంగా స్పందించాలని వారు డిమాండ్ చేసారు. ఆ మేరకు అమెరికా న్యూయార్క్‌లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉన్న హడ్సన్ నది మీద భారీ బ్యానర్ ఎగురవేసారు.
2022లో అమెరికా కాంగ్రెస్ చేసిన తీర్మానం మేరకు 1971 ఊచకోతలో 28 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, కనీసం 2లక్షల మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. వారిలో అత్యధికులు హిందూ మహిళలే. అప్పటినుంచీ బంగ్లాదేశ్‌లో హిందూ జనాభా పడిపోతోంది. 1971లో 20శాతం ఉన్న హిందువుల జనసంఖ్య ఇవాళ 8.9శాతానికి పతనమైంది.
బంగ్లాదేశ్‌లో తాజాగా అధికార మార్పిడి వంకతో హిందువులను లక్ష్యం చేసుకుని జరిగిన హింసాకాండ, ఊచకోత అమానుషమైనది. హిందూ మైనర్ బాలికల కిడ్నాపులు, అత్యాచారాలు, బలవంతపు రాజీనామాలు, ఆస్తులు స్వాధీనం చేసుకోడాల వంటి చర్యలతో సుమారు 2లక్షల మంది హిందువులను తీవ్రంగా హింసించారు. ఫలితంగా బంగ్లాదేశ్‌లోని సుమారు కోటిన్నర హిందూ జనాభా మనుగడకే ముప్పు పొంచివుంది. 2024 ఆగస్టు 5 నుంచి నేటివరకూ వెయ్యి దాడులు జరిగాయి. వాటిలో 250 సంఘటనలను ధ్రువీకరించారు.
ఆ నేపథ్యంలో అమెరికాలోని బంగ్లాదేశ్ హిందువులు తమ ప్రాణాలు రక్షించాలంటూ ఈ ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైన శీతాంశు గుహ తమ పరిస్థితి గురించి వాస్తవాలు వెల్లడించారు. ‘‘బంగ్లాదేశ్‌లో హిందువులు అంతరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్నారు. మా ఈ ప్రదర్శన నాగరిక ప్రపంచంలో మా గురించి చైతన్యం కలిగిస్తుంది అనుకుంటున్నాం. బంగ్లాదేశ్‌లోని మిలిటెంటు ఇస్లామిక్ మూకల నుంచి బాధితులను రక్షించేందుకు ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాం. బంగ్లాదేశ్‌లో హిందువులు అంతరించిపోతే ఆ దేశం మరో అప్ఘానిస్తాన్ అవుతుంది. ఉగ్రవాదులు భారత్ మీదుగా ప్రపంచం అంతటికీ విస్తరిస్తారు. పాశ్చాత్య ప్రపంచాన్ని సైతం వదలరు. ఇది అందరి సమస్య’’ అని ఆవేదన వ్యక్తం చేసారు.
మరు కార్యకర్త పంకజ్ మెహతా మాట్లాడుతూ ‘‘ఐరాస మానవ హక్కుల సంస్థ రాజకీయాలను పక్కన పెట్టి 1971 బంగ్లాదేశ్ సామూహిక జనహననకాండను అధికారికంగా గుర్తించాలి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత అతిపెద్ద ఊచకోత అదే. అమెరికా కేంద్రంగా పనిచేసే మూడు ప్రధాన సంస్థలు 1971లో పాకిస్తానీ సైనిక బలగాలు, వారి ఇస్లామిక్ మూక మిత్రులూ చేసిన ఊచకోతను, హిందూ మైనారిటీలే లక్ష్యంగా పాల్పడిన అరాచకాలనూ గుర్తించాయి. ఐరాస కూడా ఆ ఊచకోతను గుర్తించాలి. అటువంటి మరో సామూహిక జనహనన కాండను నిలువరించడానికి చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేసారు. బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న ఇస్లామిక్ ఛాందసవాదం భారతదేశానికే కాక అమెరికాకు కూడా ఆందోళనకరమే. అక్కడ దిగజారుతున్న పరిస్థితులను మానవతా సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.
బంగ్లాదేశ్‌కు ఎగుమతుల ఆదాయంలో 85శాతం అమెరికాకు దుస్తుల ఎగుమతుల నుంచే వస్తుంది. అలాంటి బంగ్లాదేశీ దుస్తుల వినియోగాన్ని నిలిపివేయాలంటూ అమెరికన్లకు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఆ దేశంలో హింసాకాండ నిలిచిపోయేవరకూ, దోషులను శిక్షించేవరకూ బంగ్లా దుస్తులను బాయ్‌కాట్ చేయాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. బంగ్లాదేశీ దుస్తులను అధికంగా కొనుగోలు చేసే వాల్‌మార్ట్, హెచ్ అండ్ ఎం, గ్యాప్ ఇంక్, టార్గెట్, పివిహెచ్ కార్ప్ తదితర సంస్థల ఉన్నతాధికారులకు విజ్ఞప్తులు వెల్లువెత్తాయి.
అమెరికాలోని యూదు సమాజం బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీలకు సంఘీభావం ప్రకటించింది. ఆ దేశంలో జరుగుతున్న దారుణాలను ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదుల దాష్టీకాలతో పోల్చింది.