ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి రెండూ లేవని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పటికీ టీడీపీ ట్విట్టర్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల ప్రతిష్టను చంద్రబాబు అపవిత్రం చేశారని ఆరోపించారు.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారనే ఆరోపణలపై నమోదైన పిటీషన్ల విచారణ సందర్భంగా సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
రాజకీయ దుర్భుద్ధితో చంద్రబాబు మత విశ్వాసాలను ఎలా రెచ్చిగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందన్నారు. పొలిటికల్ డ్రామాలు చేయవద్దని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పిందన్నారు. జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేసినట్టుగా చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి వివాదంలో జాతీయ మీడియా కూడా చంద్రబాబును తప్పు బట్టిందన్నారు. నాణ్యత లేమి కారణంగా టీడీపీ హయాంలో 14 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపితే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 18 సార్లు ట్యాంకర్లను తిరస్కరించామన్నారు. ఈ టెండర్లలో వచ్చిన వాళ్లకే కాంట్రాక్ట్‌లు ఇస్తారన్నారు.