ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హతమైన హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ నాయకుడు హసన్ నస్రల్లాకు మద్దతుగా తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలు జరిగాయి. విజయవాడ, మచిలీపట్నం వంటి నగరాల్లో నస్రల్లాను పొగుడుతూ పోస్టర్లు వేయడం వివాదాస్పదమైంది. లెబనాన్ ఉగ్రవాదికి ఆంధ్రదేశంలో ఆదరణ దక్కడం స్థానిక ముస్లిములలో పెరుగుతున్న అతివాద ధోరణులకు, సామాజిక సమరసతపై చూపుతున్న ప్రభావానికీ నిదర్శనం.
హసన్ నస్రల్లా మృతికి నివాళిగా మచిలీపట్నంలో గత శనివారం రాత్రి కొవ్వొత్తులతో ప్రదర్శన జరిగినట్లు సమాచారం. విజయవాడ, గుంటూరు నగరాల్లో కూడా అటువంటి ర్యాలీలు జరిగాయని తెలుస్తోంది. నస్రల్లా అనుకూల బ్యానర్లు ప్రదర్శిస్తూ, అతని గౌరవార్ధం నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. భారత రాజకీయాలతో కానీ భారత ముస్లిములతో కానీ ప్రత్యక్ష సంబంధం ఏమీ లేని అంతర్జాతీయ ఉగ్రవాదికి అండగా నిలుస్తామంటూ తెలుగు ముస్లింలు ప్రదర్శన చేపట్టడం ఆందోళన కలిగిస్తోంది.
‘హసన్ నస్రుల్లా తీవ్రవాది కాదు మానవతావాది’, ‘అతనొక వ్యక్తి కాదు, ఒక మార్గం, ఒక పాఠశాల’ వంటి నినాదాలు రాసిన పోస్టర్లు విజయవాడ, తేలప్రోలు వంటి ప్రాంతాల్లో కనిపించాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కూడా నస్రల్లాను మహానుభావుడిగా చిత్రీకరిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం నాడు కశ్మీర్, లక్నో తదితర ప్రాంతాల్లో షియా ముస్లిములు నస్రల్లా అనుకూల ప్రదర్శనలు చేపట్టారు.
నస్రల్లా కోసం చేసిన నినాదాలు, అటువంటి భావాలూ దేశభద్రతకు సవాల్‌గా నిలుస్తున్నాయి. మన దేశంతో సంబంధమే లేని వ్యక్తికి కొందరు భారత ముస్లిములు ఎందుకు అండగా నిలుస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. అటువంటి పరిణామాలు యువ ముస్లిముల్లో అతివాద భావాలను ప్రేరేపిస్తాయనీ, భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో వారిని ఉగ్రవాదం వైపు మళ్ళించే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ ఆందోళన కలుగుతోంది.