ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి బందరు పోర్టుకు జలమార్గం ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడిన కొల్లు రవీంద్ర, ఇన్లాండ్ వాటర్ వేస్ అభివృద్ధి కింద అమరావతి నుంచి నేరుగా పోర్టు వరకూ కాలవ ద్వారా రవాణా సౌకర్యం కల్పించే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేశారన్నారు. బందరు కాలవను అవసరం మేరకు అభివృద్ధి చేస్తే జలమార్గం సిద్ధం అవుతుందన్నారు.
అలాగే 300 ఎకరాలకు పైగా ఆస్తులున్న ఆంధ్రా జాతీయ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుందని మంత్రి తెలిపారు. స్వాతంత్రోద్యమ ప్రముఖులైన ముట్నూరి కృష్ణారావు, కోపల్లె హనుమంతరావు, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య సహకారంతో కళాశాలను ఏర్పాటు చేస్తే ముంబయి నటి జత్వాని కాదంబరి కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి అక్రమంగా కళాశాల ఆస్తులు అనుభవిస్తున్నారని దుయ్యబట్టారు.ప్రజలకు చెందాల్సిన ఆస్తి అన్యాక్రాంతం అవడంపై దీర్ఘకాలంగా పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు.
బందరు ప్రాంత ప్రజల చిరకాల వాంఛగా ఉన్న మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైన్ ఏర్పాటుకు అడుగులు ముందుకు పడుతాయని ఆకాంక్షించారు.