దేశంలో భద్రతా వైఫల్యం వల్ల 14మంది పాకిస్తానీ దేశీయులు భారత్‌లోకి చొరబడినట్లు తెలిసింది. మహారాష్ట్రలోని అనేకల్ తాలూకా జిగానీలో నలుగురు పాక్ పౌరులను ఆదివారం రాత్రి అరెస్ట్ చేసినప్పుడు ఈ విషయం బైటపడింది. దేశ భద్రతకు ముప్పు కలగజేయగల ఈ దిగ్భ్రాంతికర పరిణామంతో అక్రమ చొరబాట్ల విషయంలో ఆందోళనలు ఎక్కువయ్యాయి.
జిగానీలో అరెస్టు చేసిన నలుగురు సభ్యుల కుటుంబం అంతకుముందు కొంతకాలం ఢిల్లీలో గడిపారట. నిఘా వర్గాల సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా ఆ నిందితులు చెప్పిన విషయాలు ఆందోళనకరంగా ఉన్నాయి. వారితో పాటు ఇంకా చాలామంది పాక్ జాతీయులు భారత్‌లోకి చొరబడ్డారనీ, ఒడిషా, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల్లో నివసిస్తున్నారనీ నిందితులు వెల్లడించారు. ఆ సమాచారంతో పోలీసు బలగాలు మల్టీ-స్టేట్ ఆపరేషన్ ప్రారంభించారు. భారత్‌లోకి అక్రమంగా చొరబడిన పాకిస్తానీయులను అరెస్టు చేయడానికి అన్వేషణ మొదలుపెట్టారు.
నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా జిగానీ నుంచి పోలీసు బృందాలు ముంబై, చెన్నై, ఢిల్లీ తదితర ప్రధాన నగరాలకు వెళ్ళాయి. అయితే నిందితులు ఇచ్చిన కాంటాక్ట్ డీటెయిల్స్ సరైనవి కాకపోతే దర్యాప్తు మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదముంది.
జిగానీలోని పాకిస్తానీ కుటుంబం గురించి తొలుత సమాచారం ఇచ్చింది తమిళనాడు చెన్నై పోలీసులు కావడం గమనార్హం. చెన్నైలో కొన్నాళ్ళ క్రితం ఫాతిమా అనే ఒక పాకిస్తానీ మహిళను అరెస్ట్ చేసారు. ఆమె కర్ణాటకలోని దావణగెరెకు చెందిన వ్యక్తిని ఇటీవలే వివాహం చేసుకున్నట్లు తెలిసింది. దాంతో పాకిస్తాన్ నుంచి దొంగచాటుగా మరింతమంది వచ్చారని, అక్రమంగా భారత్‌లో నివసిస్తున్నారనీ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దాంతో పాకిస్తానీ లింకులను దర్యాప్తు చేసేందుకు అదనపు పోలీసు బృందాలను రంగంలోకి దింపారు.
గత కొద్దిరోజులుగా వరుసగా పలువురిని అరెస్ట్ చేసారు. ఒక్క బెంగళూరులోనే ఐదుగురి కంటె ఎక్కువమందిని అరెస్ట్ చేసారు. ఇందులో మరింత ఆందోళన కలిగించే అంశం ఏంటంటే… అక్రమ చొరబాటుదారుల్లో ఎక్కువమంది హిందూ పేర్లు పెట్టుకుని చెలామణీ అవుతున్నారు. ఉదాహరణకి, బెంగళూరులో ఇస్రో కార్యాలయానికి దగ్గరలో ఉన్న పీణ్యా ప్రాంతంలో దొంగ పేర్లతో తిరుగుతున్న ముగ్గురు పాకిస్తానీయులను పట్టుకున్నారు. మొన్న సోమవారం నాడు రషీద్ అలీ సిద్దికీ అనే వ్యక్తికి చెందిన నలుగురు కుటుంబసభ్యులను జిగానీ దగ్గర అరెస్ట్ చేసారు.
రషీద్ అలీ సిద్దికీ, అతని భార్య, కుమార్తె పాకిస్తాన్‌లోని పెషావర్‌కు చెందినవారు. రషీద్ కర్ణాటకలో శంకర్ శర్మ అనే పేరుతో చెలామణీ అవుతున్నాడు. అతని కుటుంబం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వెళ్ళి, అక్కడినుంచి నేపాల్ మీదుగా భారత్‌లోకి 2014లో చేరుకున్నారు. 2018లో వారు జిగానీకి చేరుకున్నారు. అక్కడ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ ప్రారంభించారు.
రషీద్ సిద్దికీ కుటుంబం, లండన్‌కు చెందిన ముస్లిం మతసంస్థ మెహదీ ఫౌండేషన్ కోసం పనిచేస్తోంది. ఆ ఫౌండేషన్‌కు చెందిన మత గురువు యూనుస్ అల్గార్‌తో సిద్దికీ కుటుంబానికి సంబంధాలున్నాయి. రషీద్ సిద్దికీ మత ప్రచారం కూడా చేసేవాడట. ఇస్లాం ప్రచారం కోసమే అతని కుటుంబం భారత్ వచ్చిందని తెలుస్తోంది. ఆ పనిలో అతనికి వాసిమ్, అల్తాఫ్ అనే మరో ఇద్దరు సహాయపడేవారని సమాచారం.
రషీద్ సిద్దికీ కుటుంబం పోలీసు విచారణలో చెప్పిన వివరాల ప్రకారం పాకిస్తాన్ నుంచి కనీసం మరో 15మందికి పైగా భారత్‌లొ చొరబడ్డారని తెలుస్తోంది. వారిలో ఎక్కువమందికి మెహదీ ఫౌండేషన్‌తో సంబంధాలున్నాయట. వారు అస్సాం, ఒడిషా, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వ్యాపించారట.
రషీద్ సిద్దికీ కుటుంబం అరెస్టుతో తేనెతుట్టె కదిలింది. పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పుడు పోలీసులు ఇతర అక్రమ చొరబాటుదారులను కనుగొనడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. బెంగళూరు పోలీసులు పీణ్యా ప్రాంతంలో మరో ముగ్గురు పాకిస్తానీ జాతీయులను అరెస్ట్ చేసారు.
ఇదే కేసుకు సంబంధించి పోలీసులు మహమ్మద్ హనీఫ్ అనే వ్యక్తిని కూడా బెంగళూరులో అరెస్ట్ చేసారు. హనీఫ్ కూతురు, అల్లుడు, మేనకోడలిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు. వాళ్ళు భారత్‌లో ఇప్పటికే నకిలీ పత్రాల సాయంతో ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, పాస్‌పోర్టులు పొందారని నిర్ధారణ అయింది.
ఇంకా పాకిస్తాన్ నుంచి ఎంతమంది అక్రమంగా మనదేశంలోకి చొరబడ్డారు, ఎక్కడెక్కడ స్థిరపడ్డారు, ఏయే కార్యకలాపాలు చేస్తున్నారు వంటి సందేహాలు ఒకవైపు… అసలు అంతమంది పాకిస్తానీలు భారత్‌లోకి అక్రమంగా చొరబడగలగడం దేశ భద్రతా వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనంగా నిలిచింది. మెహదీ ఫౌండేషన్ భారత్‌లో మత ప్రచారం కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా బైటపడే అవకాశం త్వరలోనే కనిపిస్తోంది.