NH పనుల పురోగతిపై కేంద్రమంత్రి పెమ్మసాని సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కలుపుతూ జాతీయ రహదారి విస్తరణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన ప్రణాళిక బాగుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
గుంటూరు కలెక్టరేట్లో జాతీయ రహదారుల పనులపై సమీక్ష నిర్వహించిన కేంద్రమంత్రి, అధికారులకు కీలక సూచనలు చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే హైవే-16 అభివృద్ధి ప్రణాళిక బాగుందని ప్రశంసించారు. ‘వినుకొండ- గుంటూరు రెండు లైన్ల మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించడంతో పాటు మరో 25 కిలోమీటర్లు పొడిగిస్తూ, రాజధాని అమరావతికి అనుసంధానం చేయాలనే నిర్ణయం అభినందనీయమన్నారు. ఈ మార్గం గుంటూరుకు మరో ఔటర్ రింగ్రోడ్డులా మారుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూసేకరణ, విద్యుత్త్ లైన్ల పనులు పూర్తి చేస్తే కేంద్రం పూర్తిగా ఈ మార్గాన్ని నిర్మిస్తుందన్నారు. రెండేళ్లలో హైవే అందుబాటులోకి వస్తుందన్నారు.
సమీక్షలో కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఎన్హెచ్ఏఐ అధికారులు పాల్గొన్నారు.