డ్రగ్స్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. గడచిన వారంలోనే ఢిల్లీ పోలీసులు ఐదుగురు డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. తాజాగా పంజాబ్‌కు చెందిన జితేంద్రపాల్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఇద్దరు ఆఫ్ఘనిస్థాన్ స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న తరవాత, వారిచ్చిన సమాచారంతో జితేంద్రపాల్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతను 17 సంవత్సరాలుగా బ్రిటన్‌లో ఉంటున్నాడు. పోలీసు సమాచారం తెలుసుకున్న జితేంద్రపాల్ సింగ్ దుబాయ్ పారిపోయే ప్రయత్నం చేశారు. లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో పోలీసులకు దొరికిపోయాడు.
అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా వెనుక బసోయా హస్తం ఉందని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. దేశంలోని పలు నగరాలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. బసోయాకు డి గ్యాంగ్ అధినేత దావూద్ ఇబ్రహీంతోనూ సంబంధాలున్నట్లు ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా విచారణ చేస్తున్నారు. రెండు నెలల కిందట మియావ్ మియావ్ పేరుతో డ్రగ్స్ విక్రయిస్తోన్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని రూ.3 వేల కోట్ల విలువైన మత్తుమందులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.