కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 11.72 లక్షల రైల్వే ఉద్యోగులకు రూ.2028 కోట్లు బోనస్ ప్రకటించింది. గరిష్ఠంగా రూ.17981 దక్కనుంది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ విషయం మీడియాకు తెలిపారు. రైల్వేలో 9 విభాగాలకు చెందిన వివిధ రకాల కార్మికులు, ఉద్యోగులకు బోనస్ లభిస్తుందన్నారు. పనిని ప్రోత్సహించేందుకు ఈ బోనస్ ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్ర క్యాబినెట్ మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయరంగాన్ని ఆదుకునేందుకు లక్ష కోట్లతో రెండు పథకాలను ప్రారంభించనుంది. ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి యోజన, కృషోన్నతి యోజన పథకాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా దేశంలో సుస్థిర వ్యవసాయాభివృద్ధితోపాటు, ఆహార భద్రత లభించనుంది.
మరాఠీ, బెంగాలీ,అస్సామీ, పాలీ, ప్రాకృత్ భాషలను ప్రాచీన భాషలుగా గుర్తిస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. అంతర్జాతీయ ఇంధన హబ్లో భారత్ చేరేందుకు క్యాబినెట్ ఆమోదించింది.