అంబికా విజయము : మొదటి తరంగము
***************************************************
(శరన్నవరాత్రుల ప్రత్యేక ధారావాహిక)
రచన : కీ.శే పురాణపండ రామమూర్తి
***************************************************
(శ్లో) అమరీ కబరీభార భ్రమరీ ముఖరీకృతం
దూరీ కరోతు దురితం గౌరీ చరణ పంకజం
అది స్వారోచిష మనువు యొక్క కాలం. సురథుడు అను మహారాజు సమస్త భూమండలానికీ రాజై పరిపాలిస్తున్నాడు. అతడు చైత్రవంశానికి చెందిన మహారాజు. చాలా ధర్మంగా సంచరించేవాడు. ప్రజల కష్టనష్టాలు జాగ్రత్తగ పరిశీలించి కన్నసంతానం వలె ప్రేమించేవాడు. మహారాజు దండనీతి చాల ప్రశంసాపాత్రమైనది. రాజనీతి విశారదుడు. ధర్మంగా రాజ్యపాలన చేస్తూ ప్రజాసముదాయంలో ప్రశంసాపాత్రుడుగా సంచరించే యీ సురథునకు కోలావిధ్వంసి యను మరొక రాజుతో యుద్ధము తటస్థించెను. యీతడు చతుస్సముద్ర భూమండలాధిపతియై యుండియు కాలవశమున నా కోలావిధ్వంసిచే నోడింపబడి తుదకు మంత్రులు సామంతులు దండనాయకులు సమస్త సైన్యాలు కోలావిధ్వంసి యధీనమగుటచే అపజయమునొంది వెనుదిరిగి తన నగరమును జేరెను. తుదకు తన దేశము వినా మిగిలిన భూమండలమంతయు శత్రుహస్తగతమగుటచే నాతడు చేయునది లేక స్వల్ప పరిమితమగు తన దేశమునే కాపాడుకొనుచుండెను. ఆ కోలావిధ్వంసి నంతతో నూరుకొనక తిరిగి సురథుని దేశముపై దండెత్తెను. ఆ యుద్ధములో సంపూర్ణముగ కోలావిధ్వంసికే జయము కలుగుటచే సురథుడు అశ్వము నధిరోహించి పలాయితుడై యొక ఘోరారణ్యమును చేరి చరించుచుండెను. సురథుని మంత్రులు దుర్మార్గులై తమకు స్వాధీనమైనంతవరకు ద్రవ్యము నపహరించి యెటకో పోయిరి. మహారాజు రాజ్యభ్రష్టుడై దారపుత్రాదులను వీడి అరణ్యాలపాలై చింతాక్రాంతుడై తిరుగుచు నొక మహర్షి యాశ్రమమును చేరెను.
అది మేధాఋషి యాశ్రమము. ఆ మహర్షి శమదమాది షట్సంపత్తి కలిగినవాడు, మహాజ్ఞాని, కరుణారస హృదయుడు, శాంతమూర్తి యగుటచే నా యాశ్రమము తృణ కాష్ఠ జల సమృద్ధమై నిత్య ఫల పుష్ప భరితములైన వృక్షముల తోడను సుగంధ పుష్ప లతాదుల చేతను ఆనందమును కూర్చుచుండెను. పరస్పర విరోధము కల పులి-మేక, పాము-ముంగిస, ఏనుగు-సింహము మొదలగు జంతువులు సహజ వైరమును వదిలి అన్యోన్యమైత్రితో సంచరించుచుండెను.
వంశానుగతమగు రాజ్యమందును, సహధర్మచారిణి యగు భార్య, అనుకూలురగు పుత్రులు, ప్రభుభక్తి పరాయణులగు ప్రజలు అగుటచే వారియందును మమత వదలక యా మహారాజు నిరంతర చింతాక్రాంతుడై దుర్మార్గులకు శత్రువులు ధనమేమి దుర్వినియోగమొనర్చుచున్నారో? నా దారపుత్రాదుల నెట్లు బాధించుచున్నారో? నా అమాయిక ప్రజలనేమి హింసించుచున్నారో కదా? యని విలపించుచుండెను. మరియు ఐరావత కులోత్పన్నమైన నా పట్టపుటేనుగు నేమి చేయుదురో యని ఒకసారి, మరొకసారి రాజ్యాంగములో నెట్టి దుశ్శాసనములు ప్రవేశపెట్టునో యని, ఈ రీతిగ చింతాక్రాంతుడై క్రుంగి కృశించిపోవుచు నా మేధాఋషి యాశ్రమ సమీపములోనే సంచరించుచు కందమూలాదులచే యాకలి నణచుకొనుచు కాలము గడుపుచుండెను. ఇట్లు చరించుచుండ నొకనాడా యాశ్రమ సమీపములో మహారాజునకొక అపరిచిత పురుషుడు గానవచ్చెను. ఆతనిని జూచి మహారాజిట్లు ప్రశ్నించెను.
అయ్యా, తమరెవరు? ఎచ్చటనుండి ఇచ్చటకు వచ్చినారు? తమ పేరేమి? కులమెయ్యది? తమరేమి చేయుచుందురు? భార్యాపుత్రులు కలరా? సవిస్తరముగ తమ చరిత్ర విన వేడుచున్నాను. చెప్పదగినదేని చెప్పుడని యడిగెను. వెంటనే యా అపరిచితుడిట్లు చెప్పనారంభించెను.
ఓ మహానుభావా! తమ్ముజూడ సర్వభూమండలాధిపతులగు మహారాజులవలె గన్పట్టుచున్నారు. నావలె మీరు కూడ ఏదేనొక కష్టమునకు గురియై అడవుల పాలై యుందురని తలంచెదను. మనమిరువురమును ఏకకాలములో కష్టభాగులమగుటచే సాముదాయిక కర్మఫలముగా కలుసుకొన్నాముగాన నా యభాగ్య చరిత్ర చెప్పెద నాలింపుడు.
ఓ మహాశయా! నేను వైశ్యుడను. ఒక ధనిక వర్గానికి చెందిన కుటుంబములో ఆగర్భశ్రీమంతుడనై జన్మించాను. తండ్రిగారి ద్వారా నాకు చెందిన ధనాన్ని దుర్వ్యయం చేయక వృద్ధి చేసి నాలుగురెట్లు ఆదాయం చూపించాను. నా ప్రాణం కంటె దారపుత్రాదులనెక్కువగ ప్రేమించి వారికొరకు ధనం ఇంకా వృద్ధిచేయాలి ఇంకా వృద్ధిచేయాలని నిరంతర ధనపిపాసా పరాయణుడనై సంచరిస్తూండగా కొలదికాలం క్రితం దుర్మార్గులైన నా భార్యాపుత్రులు ధనలోభముచే నన్ను చావమోది ఇల్లు వెడలగొట్టారు. నే చేయునది లేక ఈలాగున అరణ్యాలపాలై తిరుగుతున్నాను. పేరు ‘సమాధి’ అంటారు. వారు నన్ను వెడలగొట్టినా నాకు వారియందు మమకారం పోలేదు. వారెలా ఉన్నారో, ధనం జాగ్రత్తగా చూచుకొంటున్నారో లేదో? దుర్మార్గులెవరేనా వారిని బాధిస్తున్నారేమో? యని అనేక రీతుల నా మనస్సు నిరంతరం దార పుత్ర ధనాదుల యందే ఆసక్తమై సర్వకాల సర్వావస్థలయందు చింతాసముద్రములో మునిగి బాధ పడుచున్నాను. నా వృత్తాంతమిది. తమ సంగతి విన మనమాత్ర పడుచున్నది. అవకాశము కలదేని చెప్ప వేడుచున్నానని యా సమాధి యూరకుండెను. తోడనే సురథుడిట్లు పలుకదొడంగెను.
ఓ సమాధీ! నా వృత్తాంతము కూడ నీవలె కష్టదాయకమైనదే గాని కొంచెము తేడా కలదని తన రాజ్యభ్రష్టత్వాది విషయము లన్నియును జెప్పి తిరుగ పలుకదొడంగెను. ఓ వర్తక శ్రేష్ఠుడా! దార పుత్ర ధనముల విషయంలో మన ఉభయులకూ సమాన కష్టాలే సంభవించాయి గాని మన ఇరువురిలోనూ కొంత భేదం మాత్రం కలదు. అదేమన నా భార్య, నా పిల్లలు, నా ప్రజలు నన్ను ప్రేమిస్తారు. వారి ప్రాణం కంటె నన్నెక్కువగ చూస్తారు. నీ భార్య, నీ పిల్లలు మాత్రం అట్లుగాక నిన్ను ద్వేషించి ధనలోలురై నిన్ను వెడలగొట్టారు. నీయందు ప్రేమలేక ద్వేషించి విసర్జించారు. అల్లాటి కుటుంబము కొరకు నీవు ప్రాకులాడుట వెర్రితనము. అలా మూర్ఖముగా చరించుట మానవ లక్షణము కాదు. అహంకార మమకారముల వల్లనే మానవుడు చెడిపోతాడు. నిన్ను ద్వేషించిన వారిని నీవెందుకు ప్రేమిస్తున్నావో నాకర్ధమగుట లేదు. అలాంటి కుటుంబములో నీకేమి సుఖముందో నాకు బోధపడ్డం లేదు. ఇకనైనా నీవు జ్ఞానం కలవాడవై వారియందుండు మమకారమును వదలుమని రాజు పలికెను. ఆ వాక్యములాలించి యా వైశ్యుడు పలుక దొడంగెను.
మహారాజా! నీ పలుకులెంతయూ సత్యమునే బోధించుచుండెను గాని యెన్నివిధముల ప్రయత్నించినను నా కుటుంబముపై ప్రేమ పోవుటలేదు. సరికదా మనసునకు శాంతియే కలుగుట లేదనెను. ఇట్లు పరస్పరము ఒకరి కష్టసుఖము లొకరితో చెప్పుకొనుచు ఆ యాశ్రమవాసియగు మేధాఋషిని సేవించుచుండిరి. ఇట్లుండ నొకనాడా మహర్షి శాంతహృదయుడై సుఖాసనాసీనుడై ఆశ్రమమున కూర్చుండి యుండెను. సమాధియు సురథుడును కూడ యా మునిపుంగవున కభిముఖులై కూర్చుండి యుండిరి. మేధాఋషి జ్ఞానియగుటచే వీరిరువురకును వేదాంత వాక్యములు చెప్పుచుండెను, గాని వారిరువురును విరాగులు కాని కారణమున వేదాంత వాక్య శ్రవణమునందు ఆనందము కలుగుటలేదు. మహర్షితో బాగుగ చనువు కుదురుటచే మహారాజు మహర్షికి పలుక నారంభించెను.
ఓ ఋషిపుంగవా, మీరుపదేశించు జ్ఞానము మా యెడల ప్రయోజనకారి యగుట లేదు. మేమిరువురుమును విరాగులము కాలేదు. యీషణత్రయమును వర్జింపలేదు. (యీషణత్రయమన భార్య, సంతానము, ధనము) బలాత్కారముగ వానినుండి మరలి రావలసి వచ్చెను. నా వృత్తాంతమిది, యీ వర్తక శిఖామణియగు సమాధి వృత్తాంతమిది. నాకు దార పుత్ర ధన రాజ్యాదులందాసక్తి వదలలేదు. నిరంతరము వాని చింతచే దహించబడుచున్నాను. ఈతనికా! భార్యాపుత్రులు దుర్మార్గులై హింసాపరాయణులై తన్ను వెడలగొట్టినను వారియందు తనకు గల సహజానురాగము పోలేదు. అతడిక్కడ నావలెనే శోకాగ్నిజ్వాలల కాహుతి యగుచున్నాడు. గాన, కృపారస సముద్రులగు మీరు మమ్ములను కరుణించి నాకు రాజ్యమును అతనికి ధన పుత్ర కళత్రాదులును తిరిగి లభించు నుపాయము చెప్పి మమ్ములను కృతార్థులను జేయుడని సవినయముగ ప్రార్థించెను.
తోడనే యా మహర్షి చిరునవ్వు నవ్వి నాయనలారా! అంతా జగన్మాత కృప. సమస్త ప్రపంచము జగన్మాత యగు మహామాయాశక్తి అధీనమై యున్నది. సమస్త జీవులకూ విషయమార్గప్రవర్తనాజ్ఞానము కలదు. జీవులలో కల విషయజ్ఞానము మాత్రము భిన్నముగా నుండును. కొన్నిజీవులు పగటిభాగంలో చూడలేవు, అంటే కొన్ని పక్షులకు జంతువులకు పగలు కండ్లు కనుపించవు. కొన్ని అగ్ని నీరు మొదలగువానిని చూచిన మాత్రాన నీరు లోతుగా ఉంది దిగితే ప్రాణహాని కలుగుతుంది, నిప్పు కాలుతుంది మొదలగు విషయాలు గుర్తించగలవు. కొన్నిజీవులు గుర్తించలేక అగ్నిలో పడి కాలిపోతాయి. కొన్ని నీటిలో పడి మరణిస్తాయి. పక్షి తాను ఆకలిచే మలమల మాడిపోతూ కూడ ముక్కుతో ఆహారాన్ని తెచ్చి పిల్లలకు పెడుతుంది. పాము తన ఆకలిని తను కన్న గ్రుడ్లతోటే తీర్చుకుంటుంది. మృగములు పక్షులు మొదలగు జీవులలో కూడ తెలివి అనేది ఉంది. మనుష్యులలో కూడ తెలివి ఉంది. పశుపక్ష్యాదుల వలెనె మానవుడు కూడ ఆహారము, నిద్ర, స్త్రీ సంపర్కము అనువానిలో కాలం గడిపితే భార్య పిల్లలు ధనము అనువానియందే లోలుడై సంచరిస్తుంటే మృగాలకూ పక్షులకూ మనుషులకూ తేడా లేదు. అలాకాక జ్ఞానాన్ని సంపాదించి పరమేశ్వరి నారాధించి తన్ను తా గుర్తించడానికి ప్రయత్నం చేస్తే మానవుడు మానవుడిగా తయారవుతాడు గాని అహంకార మమకారాలను వృద్ధి పొందించి నిరతిశయ సుఖమును మరపించి దేహాత్మ భావాన్ని కలిగించి ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపుచు క్షణికమగు దేహాదులు శాశ్వతమనుకొనే బుద్ధిని కలిగించి కామ క్రోధ లోభ మద మాత్సర్య మోహాలకు లోనుగావిస్తూ ఉండడం మహామాయాశక్తి యొక్క పని. అట్టి మహామాయకు లోబడినవారంతా నిరంతరము సంసారంలో పడి బాధపడుతూ ఉంటారు. సంసారంలో సుఖభ్రాంతియే గాని సుఖలేశం లేదు. ఈ భ్రాంతిలోనే తన దారపుత్రాదులు తన్ను నిరసించి బాధించినా వారియందు మమకారం వదలలేకున్నాడు. దీనికి ముఖ్యకారణం మానవత్వాన్ని అర్ధం చేసుకోక పశుబుద్ధి కలవాడై ఇంద్రియలోలుడై మహామాయామోహితుడగుటే. మహాజ్ఞానులే మాయామోహితులై పొరపడుచుందురు. త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు సైతము మాయామోహితులగుచుందురు. అట్టి మాయాశక్తియే సృష్టి స్థితి లయ కారణి యగు జగన్మాత. ఆమెయే ఆదిశక్తి. ఆ మహామాయనే ప్రకృతి, మూలప్రకృతి మొదలగు ననేక నామములతో వాడుచుందురు. మహామాయాశక్తియే మహాభాగవతంలో యోగమాయగ వర్ణింపబడినది. సృష్టి స్థితి లయ కారణి యైన మహామాయ పరబ్రహ్మవలె సర్వవ్యాప్తమైనది. పరమాత్మకును, మాయాశక్తికిని భేదము లేదు. సృష్టికాలములో భిన్నముగ భాసిస్తుంది. సత్వరజస్తమోగుణాలను వేరుపరచి సృష్టి స్థితి లయాలను చేసేటప్పుడు తాను పరమాత్మ కంటె అభిన్నమయ్యు భిన్నముగ గోచరిస్తుంది. కనుకనే పరమాత్మ నిష్క్రియబ్రహ్మ యనియు, శక్తి ప్రక్రియ బ్రహ్మ యనియు నిర్ణయించారు విజ్ఞానులు. అంటే నిర్వికారమై, సర్వవ్యాపకమై, విజాతీయ, సజాతీయ, స్వగత, శూన్యమైన మాయాశక్తియుతమైన పరమాత్మ వేదాంత విజ్ఞానుల దృష్టిలో నిర్గుణ నిష్క్రియబ్రహ్మగ గోచరించును. ఆ పరబ్రహ్మయే ఉపాసకుల దృష్టిలో కర్మపరతంత్రుల దృష్టిలో భిన్నభిన్న రూపాలతో నామ రూప గుణాలతో గోచరించును. భావనా బలాన్ననుసరించి ఏ రూపాన్ని భావన చేసి ఉపాసిస్తే ఆ రూపంతో గోచరించును. కాని ఉన్నదొకటే వస్తువు. దానికి నామరూపాలు లేవు. ఐనను కేవల కరుణారస ప్రధానమైనవాడగుట పరబ్రహ్మ ఉపాసకుల సౌకర్యార్థము తనయందు కల అఘటితఘటనాసామర్థ్యము కల మహామాయచే అనేక రూపాలతో అవతరించడం సహజ స్వభావం. స్త్రీ పురుష నపుంసక లింగభేదం లేనివాడు గనుక స్త్రీమూర్తిగా పూజించినా పురుషమూర్తిగా ఆరాధించినా ప్రయోజనం పొందగలుగుతున్నాడు భక్తుడు. నాయనలారా! సక్రియబ్రహ్మ యగు చిత్కళయే ఇక్కడ మహాశక్తిగ చెప్పబడ్డది. ఆ ఆదిశక్తి నారాధిస్తే దుర్గ కరుణచే దుర్గమమైన దుఃఖాలు నశిస్తాయి. పూర్వము బ్రహ్మాది దేవతలంతా ఆ మహామాయాశక్తినే ఆరాధించి అనేక విపత్కర పరిస్థితుల నుండి రక్షింపబడి ఆనందం పొందగలిగారు. ఇహపర సుఖసాధనమైనది జగన్మాత సేవయే, గాన ఆమెనాశ్రయించి మీరిరువురు సుఖాన్ని పొందుడని మహర్షి యూరకుండెను.
ఆ ఋషి వాక్యములు విని మహారాజు తిరిగి మునిపుంగవునితో నిట్లు పలుకదొడంగెను. ఓ దయామయుడా! నీవు సృష్టి స్థితి లయలకాధారమైనది మహామాయయని వర్ణించావు. ఆ మాయ సర్వవ్యాపకమైనదని బల్కియున్నావు. ఆ మాయ యొక్క రూపం ఎలా ఉంటుంది? దేవతలామెనెప్పుడు ప్రార్థించారు? ఏ కారణంచే ఆమె ఆవిర్భవించింది? ఏఏ కృత్యాలు చేసింది? సంపూర్ణముగా జగన్మాతయగు మహాశక్తి యొక్క చరిత్ర విన కుతూహలపడుచున్నాము. గాన సవిస్తరముగా చెప్పుడని మేధాఋషిని ప్రార్ధించెను. మహారాజు ప్రార్ధననాలించి యా మహర్షి మనసా జగన్మాతను స్మరించి సంగ్రహముగా దేవీచరిత్రను చెప్ప మొదలిడెను.