ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఉద్ఘాటించారు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకునేందుకే తిరుపతికి వచ్చాను అన్నారు.
ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మమని వివరించిన పవన్ కళ్యాణ్, తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి సభలో మాట్లాడారు. ఏడుకొండల స్వామికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఉండాలా అని ప్రశ్నించారు. అన్నీ ఓట్ల కోసమే చేస్తామా? ఓట్ల కోసమే మాట్లాడతామా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమలలో అపచారం జరుగుతోందని, సరిదిద్దండి అని గతంలో చెప్పినా అప్పటి పాలకవర్గం పట్టించుకోలేదన్నారు. అందుకే 11 సీట్లకే పరిమితమయ్యారన్నారు. కలియుగంలో ధర్మానికి ప్రతిరూపం శ్రీ వేంకటేశ్వరస్వామి అని పేర్కొన్నారు.
సనాతన ధర్మానికి కొన్ని దశాబ్దాలుగా అవమానం జరుగుతూనే ఉందన్నారు. భారతీయుడిగా తిరుమలకు వచ్చానన్న పవన్ కళ్యాణ్, భిన్నత్వంలో ఏకత్వం చూపేది సనాతనధర్మమే అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే అవహేళన చేశారన్నారు.
లౌకికవాదం పేరిట హిందువుల నోరునొక్కడం సరికాదన్నారు. హిందూ దేవుళ్ళను తిడితే నోరెత్తకూడదా అని ప్రశ్నించారు. ఇస్లాం దేశాల మాటలు సూడో సెక్యులరిస్టులకు వినపడవా అని నిలదీశారు. హిందువులంతా ఏకమయ్యే సమయం వచ్చింది. సనాతన ధర్మానికి రంగు,వివక్ష లేదన్నారు. సనాతన ధర్మానికి హాని తలపెట్టేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ సారి ఎన్నికలు వస్తే వారిని 11 నుంచి ఒక సీటుకు పరిమితం చేద్దామన్నారు.
తిరుమల ప్రసాదాల తయారీలో నిబంధనల ఉల్లంఘనపైనే తమ ఆవేదన అని పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తుమని వివరించారు. జగన్ హయాంలో ఉన్న తిరుమల తిరుపతి బోర్డు వైఖరిపైనే తమ ఆరోపణలని వివరించారు. వైవీ సుబ్బారెడ్డి హయాంలో రూ.10వేలు తీసుకుని రూ.500లకు రశీదు ఇచ్చేవారు అన్నారు.
స్వామివారి నిజరూప దర్శనం జరిగినప్పుడు తెలుస్తోందన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం పై గత ఈవో ధర్మారెడ్డి ఏమయ్యారు? ఎందుకు మాట్లాడటలేదని ప్రశ్నించారు.